Fri Dec 20 2024 01:24:15 GMT+0000 (Coordinated Universal Time)
భారీ వర్షాలు.. కళ్లకు పెను ముప్పు
తేమతో కూడిన వాతావరణం, భారీ వర్షపాతం కారణంగా ఇన్ఫెక్షన్ కేసులు చాలా పెరుగుతూ ఉన్నాయి
వర్షాకాలంలో దగ్గు, జలుబు మాత్రమే కాదు.. మనల్ని కండ్ల కలక కూడా ఊహించని విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వారం రోజులు నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు చిన్నారులు, పెద్దలు తేడా లేకుండా కండ్లకలకతో కంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దీనినే పింక్ ఐ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లోని పిల్లలలో కంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోంది. కండ్లకలక మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇటానగర్లోని అన్ని పాఠశాలలు జూలై 25 నుండి జూలై 29 వరకు నిలిపివేశారు. బ్యాక్టీరియా, వైరస్లతో ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తూ వస్తుంది. ఈ సమయంలో దురద, మంట, కళ్ళ నుండి నీరు కారడం వంటి సమస్యలు ఊహించని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి.
తేమతో కూడిన వాతావరణం, భారీ వర్షపాతం కారణంగా ఢిల్లీలో ఇన్ఫెక్షన్ కేసులు చాలా పెరుగుతూ ఉన్నాయి. అంటువ్యాధి కావడంతో ఇది ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచించారు. పరిశుభ్రత ముఖ్యమని.. కళ్లను తాకే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. కంటి ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలను జూలై 29 వరకు (8వ తరగతి పిల్లల వరకూ) మూసివేసినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. డిఎస్యు, ఐసిసి బృందం ఐదు రోజుల పాటు సర్వే నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్లో పేర్కొంది. కండ్లకలక కేసులు పెరుగుతూ ఉండడంతో.. వ్యాప్తిని అడ్డుకోడానికి సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి కొనసాగుతూ ఉంది. వడోదరలో కూడా అందుకు సంబంధించిన కేసులు పెరిగాయి. ఇన్ఫెక్షన్ అన్ని వయసుల వారికి వ్యాపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో కూడా కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు నిపుణులు.
Next Story