Mon Dec 23 2024 15:13:25 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే వ్యక్తికి కోవిడ్-19, మంకీ పాక్స్, హెచ్.ఐ.వీ. పాజిటివ్ కూడా..!
ఇటలీలో 36 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19, మంకీ పాక్స్, హెచ్.ఐ.వీ.. మూడూ పాజిటివ్ గా తేలింది
ఇటలీలో 36 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19, మంకీ పాక్స్, హెచ్.ఐ.వీ.. మూడూ పాజిటివ్ గా తేలింది. ప్రపంచంలో ఇలాంటి కేసు రావడం మొదటిసారి అని అంటున్నారు. ఆ వ్యక్తికి మంకీపాక్స్, కోవిడ్-19, హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు నివేదించారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం సదరు రోగి స్పెయిన్ నుండి ఐదు రోజుల పర్యటన తర్వాత తిరిగి వచ్చిన తొమ్మిది రోజుల పాటూ జ్వరం, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, గజ్జ ప్రాంతంలో మంట ఉందని వైద్యులకు తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతనికి ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన దద్దుర్లు కూడా వచ్చినట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ఆ వ్యక్తిని ఆసుపత్రి లోని అత్యవసర విభాగానికి పంపించారు. వెంటనే అతన్ని ఇన్ఫెక్షియస్ డిసీజ్ యూనిట్లో చేర్చారు.
మనిషి శారీరక పరీక్షలో పెరియానల్ ప్రాంతంతో సహా వివిధ శరీర భాగాలలో మచ్చలు, చర్మంపై గాయాలు కనిపించాయి. పలు అంతర్గత భాగాలలో కూడా వాపు కనిపించింది. అతని టెస్ట్ రిపోర్టులో మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించారు. అతనికి హెచ్ఐవీ పాజిటివ్ అని కూడా తేలింది. SARS-CoV-2 జన్యువు యొక్క సీక్వెన్సింగ్ అతనికి ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BA.5.1 సోకినట్లు నిర్ధారించారు. ఆ వ్యక్తికి ఫైజర్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ రెండు డోస్ల టీకాలు కూడా వేశారు. అతని కేసు ఆగస్ట్ 19న జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించబడింది. దాదాపు ఒక వారం తర్వాత ఆ వ్యక్తి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతను COVID-19, మంకీపాక్స్ నుండి కోలుకున్నాడు. ఇక అతడికి HIV చికిత్స ప్రారంభించబడింది.
Next Story