కాలుష్యంతో గుండెకు పెను ప్రమాదం.. అధ్యయనంలో సంచలన విషయాలు
కాలుష్యం మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు..
కాలుష్యం మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే కాలుష్యం వల్ల జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, వాహన కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తుండగా.. తాజాగా వాహన కాలుష్యం గుండెకు పెను ముప్ప ప్రమాదం పొంచివుందని నిపుణులు స్పస్టం చేస్తున్నారు. ప్రతి రోజు వ్యాయామం చేసి, ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకుంటున్నా వాహన కాలుష్యం బారినపడితే గుండెకు గండి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహన కాలుష్యం గుండెకు చేటు చేస్తుందని నవీ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి చెందిన కార్డియోవాస్కులర్, థొరాసిక్ సర్జరీ కన్సల్టెంట్, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ అంజాద్ షేక్ పేర్కొన్నారు.
విషపూరితం
వాహనాలు విడుదల చేసే వాయువులు విషపూరిత పదార్ధాలతో కూడిన కాక్టైల్ వంటిదని ఆయన హెచ్చరించారు. ఇవి విడుదల చేసే పర్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజెన్ ఆక్సైడ్లు, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రమాదకరమైనవని డాక్టర్ అంజాద్ షేక్ చెబుతున్నారు. ఈ కాలుష్య కారకాలు మనం పీల్చే గాలిలోకి చేరతాయని, ఆపై మన గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. పర్టిక్యులేట్ మ్యాటర్, చిన్న పదార్ధాలు ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలోకీ ప్రవేశిస్తాయని చెప్పారు. ఇవి క్రమంగా ఇన్ఫ్లమేషన్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌నూ ప్రేరేపించి రక్త నాళాలు కుచించుకుపోయేలా చేస్తాయని అన్నారు.
గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం:
ఇదిలా ఉండగా,వాహన కాలుష్యానికి నిరంతరం గురైనట్లయితే గుండెపోటు, స్ట్రోక్ ముప్పు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇతర హృద్రోగ ముప్పు అధికమవుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడం కేవలం ఒత్తిడినే కాదు, బీపీని కూడా పెంచుతుందని ఈ ఏడాది నవంబర్‌లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ ద్వారా నెలకొనే వాయు కాలుష్యంతో 24 గంటల పాటు కొనసాగేలా రక్తపోటు పెరుగుతుందని ఈ అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. ఇది గుండె సమస్యలకు దారితీసే అధిక సోడియంతో కూడిన ఆహారం తీసుకోవడంతో సమానమని పేర్కొన్నారు.