బ్రెయిన్ స్ట్రోక్‌కి ప్రధాన కారణాలు ఏంటి?.. నిర్లక్ష్యం చేస్తే అంతే!
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఇది కొన్నిసార్లు ప్రాణాపాయంగా కూడా మారవచ్చు. దీని వెనుక చాలా..
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఇది కొన్నిసార్లు ప్రాణాపాయంగా కూడా మారవచ్చు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ మన రోజువారీ జీవనశైలి అలవాట్లే ఎక్కువ ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నమాట. ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ గౌరవ్ బన్సాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మనం కొన్ని అనారోగ్య సమస్యల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. బ్రెయిన్ స్ట్రోక్‌ను ఆహ్వానించే జీవనశైలి అలవాట్లు ఏమిటో డాక్టర్ గౌరవ్ బన్సాల్ పూర్తి విషయాలు వెల్లడించారు. అయితే ముందుగా బ్రెయిన్ స్ట్రోక్‌కి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం..
ధూమపానం:
బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణమయ్యే ప్రధాన కారకాల్లో ధూమపానం కూడా ఒకటి. దీని కారణంగా రక్త నాళాలు ఇరుకైనవి, గట్టిపడతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి వంటివాటిని త్వరగా మానేయడం ఉత్తమం.
పోషకాలు లేని ఆహారం
ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉండే ఆహారాలు ఊబకాయం,రక్తపోటును పెంచుతాయి. రెండూ ఎక్కువగా స్ట్రోక్‌కి కారణమవుతాయి. పండ్లు, కూరగాయలు, మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
వ్యాయామం లేకపోవడం:
ప్రస్తుత జీవన విధానంలో మనిషికి సరైన జీవనశైలి లేకపోవడం. సరైన వ్యాయమం చేయని వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెంచుతుందంట. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయబడుతుంది. దీనితో రక్తపోటును నియంత్రించవచ్చు. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం:
ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వ్యక్తులు, వారి రక్తపోటు గణనీయంగా పెరుగుతుందట. అంతే కాదండోయ్ గుండె కొట్టుకోవడంలో కూడా మార్పులు జరగవచ్చు. దీని కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని డాక్టర్ గౌరవ్ బన్సాల్ చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మద్యపానాకి దూరంగా ఉండటం ఉత్తమం.
ఒత్తిడి:
ఈ రోజుల్లో ఒత్తిడి అనేది చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే మారుతున్న జీవనశైలి, టెన్షన్, ఉద్యోగంలో ఒత్తిడి ఇలా ఒక్కటేమిటి రకరకాల కారణాల వల్ల మనిషి ఈ రోజుల్లో అధిక ఒత్తిడికి గురవుతున్నాడు. అధిక ఒత్తిడి అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అంతేకాదు.. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, మీ మనస్సును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి.
ఊబకాయం:
ఊబకాయం అనేది ఎన్నో సమస్యలు కలిగిస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయం మధుమేహం, అధిక రక్తపోటు వంటి పరిస్థితులకు దారి తీస్తుందని వైద్యుడు చెబుతున్నారు. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించవచ్చన్నది వైద్యుల వాదన.
నిద్ర లేమి:
ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది కదూ. నిద్ర లేకపోవడం శరీరం సహజ ప్రక్రియలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. ఆరోగ్యవంతమైన పెద్దలు ప్రతిరోజూ 7-9 గంటల ప్రశాంతమైన నిద్రను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం, అధిక రక్తపోటు, కర్ణిక దడ వంటి వైద్య పరిస్థితులు స్ట్రోక్‌కు ప్రమాద కారకాలుగా పరిగణించబడతాయి. దాన్ని విస్మరించే బదులు, రెగ్యులర్ చెకప్‌లు చేసుకుంటూ ఉండండి.
మందులను నిర్లక్ష్యం చేయకండి:
ఇక చాలా మంది ఏవైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో మందులు వేసుకోవడంతో కొంత నిర్లక్ష్యం చూపుతారు. డాక్టర్లు ఇచ్చిన మందులను సరైన సమయంలో వేసుకోకపోతే కూడా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందంటున్నారు.
హైడ్రేటెడ్‌గా ఉండకపోవడం:
డీహైడ్రేషన్ రక్తం యొక్క స్నిగ్ధతను పెంచుతుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. సరైన మోతాదులో నీరు తాగితే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తుగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
మీ అలవాట్లను మార్చుకోవడం..
మీ అలవాట్ల కారణంగా స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితి మరణానికి కూడా దారితీయవచ్చు. జన్యుశాస్త్రం, పెరుగుతున్న వయస్సు మన నియంత్రణలో లేని కొన్ని కారకాలు అయినప్పటికీ, మనం జీవనశైలి అలవాట్లను నియంత్రించవచ్చు. అందువల్ల, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన పద్ధతులు, ఆహారపు అలవాట్లను ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీరు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇదండీ.. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు. సో.. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారం తీసుకోండి. చివరగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా.. ఈ అంశాలన్ని వైద్యనిపుణులు తెలిపిన వివరాల ప్రకారమే మీకు అందించడం జరిగింది. మీకు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినా.. ఏవైనా అనుమానాలు ఉన్నా ముందుగా వైద్యులను సంప్రదించాలని 'తెలుగు పోస్ట్' సూచిస్తోంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)