Mon Dec 23 2024 06:23:22 GMT+0000 (Coordinated Universal Time)
8 నెలల చిన్నారిని బలిగొన్న గాలి-వాన.. తీరని కడుపుకోత
రహ్మత్ నగర్ లో చిన్నారి ఇంట్లో నిద్రిస్తుండగా.. పక్కనున్న భవనం పై నుంచి రెయిలింగ్ కూలి రేకులషెడ్డుపై పడింది.
హైదరాబాద్ లో నిన్న రాత్రి గాలి-వాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల వ్యవధిలో నగరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ గాలి-వాన అభం శుభం తెలియని 8 నెలల చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. రహ్మత్ నగర్ లో చిన్నారి ఇంట్లో నిద్రిస్తుండగా.. పక్కనున్న భవనం పై నుంచి రెయిలింగ్ కూలి రేకులషెడ్డుపై పడింది. దాంతో ఇంటిలో నిద్రిస్తున్న చిన్నారి జీవనిక అక్కడికక్కడే కన్నుమూసింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బోసినవ్వులతో పలుకరించే కన్న బిడ్డ మరణాన్ని తట్టుకోలేక.. ఆ తల్లి తల్లడిల్లింది. రాత్రి కురిసిన భారీవర్షం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ కి చెందిన శ్రీకాంత్ - జగదేవి దంపతులు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ లో కూలిపని చేసుకుంటూ బోరబండ సమీపంలోని రహ్మత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. గత రాత్రి (ఏప్రిల్ 25)ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పక్కనే ఉన్న నాలుగో అంతస్థు బిల్డింగ్ రెయిలింగ్ పక్కనే ఉన్న రేకులషెడ్డుపై కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న పాపపై శిథిలాలు పడటంతో పాప కన్నుమూసింది. మరో నాలుగురోజుల్లో ఆ ఇల్లు ఖాళీ చేసేవాళ్లమని, పాప ప్రాణాలు దక్కేవంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
ఈ ప్రమాదం జరిగినపుడు జీవనిక తల్లిదండ్రులు, మరో పాప అంతా బయట ఉన్నారు. వారంతా కూడా అక్కడే నిద్రించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. కాగా.. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story