Sun Dec 22 2024 15:58:48 GMT+0000 (Coordinated Universal Time)
Trains : ఒక్క సీటు కూడా ఖాళీ లేదే... అన్నీ అయిపోయాయ్.. ఇప్పుడేటి సేయాలి?
సంక్రాంతి పండగకు వెళ్లే స్పెషల్ రైళ్లన్నీ దాదాపుగా ఫుల్ అయ్యాయి. వందేభారత్ రైళ్లలోనూ సీట్లు నిండిపోయాయి
సంక్రాంతి పండగకు అందరూ సొంత ఊళ్ల బాట పడతారు. హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అయిపోతుంది. ఈసారి వరస సెలవులు రావడంతో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇంటికి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి పండగ కోసం ఇటు టీఎస్ఆర్టీసీ, అటు ఏపీఎస్ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిదివేలకు పైగానే ప్రత్యేక సర్వీసులను ఒక సంక్రాంతికి నడుపుతున్నారంటే రష్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సుదూర ప్రాంతాలకు...
ఇక ఎక్కువ మంది సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు ఎక్కువగా రైళ్ల మీద ఆధారపడి ప్రయాణలు సాగిస్తుంటారు. సురక్షితంగా, వేగంగా వెళ్లేందుకు రైళ్లు ఎక్కువగా ఉపయోగపడతాయని భావించి ఎక్కువ మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఈ సంక్రాంతి పండగ కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు 115 స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎప్పుడూ నడిచే రైళ్లు ఎలాగూ ఉన్నాయి. నిన్నటి నుంచే స్పెషల్ ట్రెయిన్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకూ నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రిజర్వ్ చేసుకోవడంతో...
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఎక్కువగా ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అియతే అన్ని రైళ్లలో టిక్కెట్లు ముందుగానే ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. స్పెషల్ రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోకుండా ముందుగానే తమ బెర్త్ లను రిజర్వ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ వరకూ ఉన్న రైళ్లన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. వందేభారత్ రైళ్లలో కూడా బోగీలు పెంచారు. అందులో కూడా టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు. వెయిటింగ్ లిస్ట్ నడుస్తుండటంతో రైళ్లలో వెళ్లాలనుకుంటున్న వారు కొంత నిరాశ చెందుతున్నారు.
Next Story