Fri Nov 22 2024 16:34:39 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : కూల్చేయండి.. ఆక్రమణలను క్షమిస్తే.. సుందర నగరం భవిష్యత్ ఉండదు సుమా..!
హైడ్రా కూల్చివేతలపై ఆరోపణలు, విమర్శలున్నప్పటికీ హైదరాబాద్ మంచి కోరుకునే వారు మాత్రం "హైడ్రా" నిర్ణయమే కరెక్ట్ అంటారు
హైడ్రా కూల్చివేతలపై అనేక రకమైన ఆరోపణలు, విమర్శలు వస్తున్నప్పటికీ హైదరాబాద్ మంచి కోరుకునే వారు మాత్రం "హైడ్రా" నిర్ణయమే కరెక్ట్ అంటారు. ఎందుకంటే హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు కొద్దిమందిని బాధపెడుతున్నా, నష్టపరుస్తున్నా, ఎక్కువ మందికి మాత్రం భవిష్యత్ లో లాభమేనని చెప్పకతప్పదు. ఇన్నాళ్లూ నగరాన్ని ఆక్రమించుకుని అక్రమార్కులు చెలరేగిపోయారు. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేశారు. అది ప్రభుత్వ భూమి అని లేదు. ఎన్ఆర్ఐది అనేది లేదు. ఎక్కడి నుంచో వచ్చినోళ్లు కొందరయితే.. ఇక్కడే ఉన్న వాళ్లు మరికొందరు ఆక్రమణలకు తెరతీశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించి
అనేక భూవివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలన్నీ అన్యాక్రాంతమయినా పాలకులు చోద్యం చూస్తున్నారు. అవినీతి అధికారుల దెబ్బకు అక్రమ నిర్మాణాలకు ఆఘమేఘాల మీద విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి సౌకర్యాలను కూడా కల్పించడంతో వారు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వెంచర్లు వేసి, విల్లాలను నిర్మించి కోట్ల రూపాయలకు ఇతరులకు అంటగట్టారు. ఇలా ఎందరో ఇటు రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన బిల్డర్లు చాలా మంది ఈ అక్రమార్కుల్లో ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా లేకపోలేదు. కానీ వారంతా క్యాష్ కొట్టి పాలకులు, అధికారుల నోళ్లు, చేతులను కట్టేస్తూ వచ్చారు. వారు ఇన్నాళ్లూ చేసిన అక్రమాలకు తెరపడాల్సిందేనని ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు.
కొన్ని దశాబ్దాలుగా...
కానీ ఇప్పుడు ఇక కుదరదంటోంది హైడ్రా. ఇంతటి స్థాయిలో ఆక్రమణల కూల్చివేత ఎప్పుడూ జరగలేదు. దీనిపై అనేక విమర్శలకు మౌనంగానే బుల్ డోజర్ లు సమాధానం చెబుతున్నాయి. చెరువు లేదు.. కుంట లేదు.. నాలా లేదు.. హైదరాబాద్ ను గత కొన్ని దశాబ్దాలుగా కొందరు నాశనం చేశారన్నది హైదరాబాద్ ను అభిమానించే వారు ఎవరైనా అనుకునే మాట ఇది. కానీ ఎవరినీ ఏమీ అనలేని మాట. ఇన్నాళ్లకు ఒక్క నిర్ణయం.. ఒక్కరి ఆలోచన... అది భవిష్యత్ కు బంగారు బాట వేస్తుందంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు. అది ఎవరిదైనా కావచ్చు. టాలివుడ్ హీరోలైనా, రాజకీయ నేతలైనా, పట్టున్న నాయకులైనా, సామాన్యులైనా ఒకటే న్యాయం అనేలా హైడ్రా ప్రవర్తిస్తే ఇక దానికి తిరుగుండదు.
90 శాతం మంది...
హైదరాబాద్ నగరంలో పది శాతం మంది దీనిని వ్యతిరేకించినా 90 శాతం మంది హైడ్రా వెన్నంటి నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరం మంచి కోరుకునే వారు ఎవరైనా ఈ ఆక్రమణల తొలగింపును వ్యతిరేకించరు. కష్టపడి.. పైసా పైసా దాచి పెట్టి అన్నీ సక్రమమైనదని భావించి స్థలం కొనుగోలు చేసిన వారు ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే సవాలక్ష నిబంధనలతో విసిగించే.. వేధించే అధికారులకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. కమాన్ హైడ్రా.. వయ్ ఆర్ విత్ యూ అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. కూల్చివేతలకు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి కూల్చివేతలు మొదలపెట్టడం శుభపరిణామమే.
Next Story