Mon Dec 23 2024 15:42:06 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ శివారు ఘట్కేసర్ మండలంలోని శ్రీనిధి విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు
హైదరాబాద్ శివారు ఘట్కేసర్ మండలంలోని శ్రీనిధి విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారం ఇచ్చి సుమారు 290 మంది విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారన్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల పలుమార్లు విద్యార్థి సంఘాలు ఈ విషయమై ఆందోళన చేసినా అనుమతి వస్తుందని యాజమాన్యం నమ్మిస్తూ వచ్చిందని ఆరోపించారు. గత నెల 31న తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేయడంతో... వర్సిటీ కార్యదర్శి కేటీ మహి తల్లిదండ్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలోకి తీసుకుంటామని, అందుకు ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులను కోరారు.
గడువు అయిపోయినా విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు.సెకండ్ ఇయర్ చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫైనల్ ఇయర్ ఫీజు కూడా యాజమాన్యం తీసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
Next Story