Tue Nov 05 2024 23:38:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పిల్లాడి ప్రాణం పోడానికి కారణం వాళ్లే
హైదరాబాద్ నగరంలో ఓ బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన విషాదాంతం అయింది
హైదరాబాద్ నగరంలో ఓ బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన విషాదాంతం అయింది. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాలో కొట్టుకుపోయిన ఐదేళ్ల బాలుడు మిథున్.. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప వద్ద తేలాడు. స్థానికులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బయటకు తీశాయి.
మిథున్ మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలతో వరదనీరు రావడంతో.. దాన్ని నాలాలోకి పంపించిన ఇద్దరు వ్యక్తులు.. మళ్లీ మూత వేయకపోవడంతో ఈ విషాద ఘటన జరిగింది. వారి నిర్లక్ష్యం వల్లే మిథున్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బాలుడు పడిపోక ముందు అపార్ట్మెంట్ నిర్వాహకులు నీటిని పంపించడానికి నాలా క్యాప్ ను తీశారు. ఆ తర్వాత మ్యాన్ హోల్ మూత పెట్టడం మర్చిపోయారు. అంతలోనే బాలుడు అందులో పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి దానికి కారకులైన వారిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రోజు ఉదయం 8:20 ప్రాంతంలో మ్యాన్ హోల్ మూతను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాచ్మెన్ కలిసి తెరిశారు. 11 గంటల సమయంలో మిథున్ అదే మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా అతని జాడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను చూడడంతో బాలుడు మ్యాన్ హోల్ లో పడి పోయినట్లు గుర్తించారు. బాలుడు మరణించడానికి ఎన్నారై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి, వాచ్‌మ్యాన్ కారణమని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టమవుతోంది.
Next Story