ఏడడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి - కీలక ఆదేశాలు జారీ!
ఎత్తు వల్ల బాధపడుతున్న ఆర్టీసీ కండక్టర్ అమీన్‌కు తగిన ఉద్యోగం కల్పించేందుకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: క్కువ పొడవుతో విధులు నిర్వహిస్తూ నెట్టింట్లో సంచలనం సృష్టించిన ఆర్టీసీ కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. 214 సెం.మీ. (సుమారు 7 అడుగులు) ఎత్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ, 195 సెం.మీ. మాత్రమే ఉన్న బస్సుల్లో పని చేయడం వల్ల తీవ్రమైన శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తన సమస్యను ఆయన గత కొంత కాలంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, ప్రయాణికులు సైతం అతనికి మరొక ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, అమీన్‌కు ఆర్టీసీలో మరొక తగిన ఉద్యోగం కేటాయించేందుకు అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అమీన్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే, అతడి తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన 2021లో మరణించడంతో కారుణ్య నియామకం ద్వారా అమీన్‌కు మెహిదీపట్నం డిపోలో కండక్టర్ ఉద్యోగం లభించింది. అయితే అతడి ఎత్తు వల్ల విధులు నిర్వహించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయనకు తగిన రీతిలో సహాయం చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం.