Thu Nov 07 2024 22:38:47 GMT+0000 (Coordinated Universal Time)
Numaish : ఎగ్జిబిషన్కు కోవిడ్ ఎఫెక్ట్... సందర్శకులు వస్తారా? అనుమానమే?
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ పై కోవిడ్ ఎఫెక్ట్ పడనుంది
హైదరాబాద్లో నుమాయిష్ అంటే అదొక క్రేజ్. ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు లక్షలాది మంది నగరం నుంచే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. అయితే ఈసారి నుమాయిష్ కు కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. జేఎన్ 1 కేసులు ఎక్కువగా ఉండటం, తెలంగాణలోనూ 55 కోవిడ్ వైరస్ కేసులు నమోదు కావడంతో నుమాయిష్ కు జనం వస్తారా? రారా? అన్న సందేహం నెలకొంది. నుమాయిష్ అంటేనే లక్షలాది మంది ఒక చోట చేరి షాపింగ్ చేసుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటూ ఎంజాయ్ చేసే స్థలం. అయితే కోవిడ్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈసారి నుమాయిష్ నిర్వహణపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరి కొద్ది రోజుల్లోనే...
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి రెండో వారం వరకూ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా ఇక్కడ పేరుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. చౌకధరలకు దొరుకుతుండటంతో ప్రతి ఏటా జరిగే ఎగ్జిబిషన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని నగరవాసులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికి 82 సార్లు ఎగ్జిబిషన్ నిర్వహించారంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ను నగరంలో ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకుంటారు.
పేద నుంచి ధనికుల వరకూ...
ఖరీదైన వస్తువుల నుంచి అతి స్వల్పమైన ధరలకు లభించే వస్తువులు ఇక్కడ దొరుకుతుండటంతో పేద, ధనిక తేడా లేకుండా ఎగ్జిబిషన్ కు క్యూ కడుతుంటారు. ఇక సెలవు దినాల్లో చెప్పాల్సిన పనిలేదు. మనిషి నడవాలంటే కూడా కష్టమే అవుతుంది. అందుకే శని, ఆదివారాల్లో ఎగ్జిబిషన్ రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసుశాఖ కూడా శ్రమించాల్సి వస్తుంది. దాదాపు రెండువేలకు పైగా స్టాళ్లు అలరిస్తుండటంతో జనం కూడా అంతే స్థాయిలో వస్తుంటారు. 1983లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమయింది. కోవిడ్ సమయంలో 2021లో నుమాయిష్ కు సందర్శకులు రాక తగ్గడంతో పాటు ప్రభుత్వం కూడా త్వరగానే క్లోజ్ చేయించాల్సి వచ్చింది. 2019లో నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి వందల సంఖ్యలో స్టాళ్లు బూడిదయ్యాయి.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో...
అయితే ఇప్పటికే భారత్ లో నాలుగువేలకు పైగానే కరోనా వైరస్ కేసులు దాటిపోయాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణలోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ పై కోవిడ్ ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన అటు వ్యాపారుల్లోనూ, ఇటు నిర్వాహకుల్లోనూ కనపడుతుంది. ప్రభుత్వం కూడా ఇటువంటి జన సమర్ధం ఉన్న ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతుంది. మరి ఈసారి నుమాయిష్ ఎలా జరుగుతుందన్న దానిపై అనుమానాలతో పాటు జరిగినా సందర్శకుల సంఖ్య ఆశించిన సంఖ్యలో ఉండదని కూడా అంచనాలు ఉన్నాయి.
Next Story