Fri Jan 10 2025 22:10:50 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఖాళీ జాగాలకు కూడా డిమాండ్ కరువా? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా?
హైదరాబాద్లో ఖాళీ స్థలాలకు కూడా డిమాండ్ పడిపోయింది.
హైదరాబాద్లో ఖాళీ స్థలాలకు కూడా డిమాండ్ పడిపోయింది. వేెకెంట్ స్థలాల రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ అధికారులు సయితం చెబుతున్నారు. హైదరాబాద్ జంటనగరాల్లో ఒకప్పుడు ఖాళీ స్థలాలకు భారీగా డిమాండ్ ఉండేది. వంద గజాల స్థలం కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోయేది. ఇక రెండు వందల గజాలకు పైగా ఉంటే ఇక ఫోన్ల మీద ఫోన్లు. ఏజెంట్లు కూడా ఖాళీ స్థలాలను విక్రయించడంలో బిజీగా ఉండేవారు. ఇక ఆపైన ఉండే స్థలాల విషయం ఇక చెప్పాల్సిన పనిలేకుండా అమ్ముడు పోయేవి.
కొనేవాళ్లేరీ?
ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఖాళీ స్థలాలను కొనుగోలు చేసేవారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా వంటి దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు హైదరాబాద్ లో స్థలాల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. దానిని పెట్టుబడిగానైనా భావించే వారు కొందరైతే. కొంతకాలం తర్వాత హైదరాబాద్ కు వచ్చి స్థిరపడవచ్చన్న భావనతో ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు. మరికొందరు తమ వారసుల కోసం, మరికొందరు తమ తల్లిదండ్రులు నివాసం ఉండేందుకు ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి అందులో భవనాలను నిర్మించుకునే వారు. ఎవరూ లేకుంటే వాటిని కొందరు ఖాళీగా ఉంచడం, తాము ఏడాదికి ఒకసారి వచ్చినప్పుడు నెల రెండు నెలల పాటు అందులో ఉంటూ ఎంజాయ్ చేసేవారు.
డిమాండ్ తగ్గి...
కానీ గత కొంత కాలంగా ఖాళీ స్థలాలకు గిరాకీ తగ్గింది. ఎన్ఆర్ఐలు కూడా ఖాళీ స్థలాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదు. హైదరాబాద్ కంటే మిగిలిన ప్రాంతాలైన బెంగళూరు, మైసూరు వంటి నగరాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. కర్ణాటకలో కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారుల విషయంలోనూ అంత భయం లేదు. కానీ తెలంగాణలో మాత్రం అధికారులపై నమ్మకం పూర్తిగా పోయింది. హైడ్రా వచ్చిన తర్వాత అనేక అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో వాటికి పర్మిషన్ ఇవ్వడంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడం కూడా విశ్వాసం కోల్పోవడానికి కారణమయింది. ఖాళీ భూములపై ఆ పప్రభావం పడింది.
భూ కబ్జాల భయం...
మరోవైపు ఆక్రమణల విషయంలోనూ హైదరాబాద్లో భయం పట్టుకుంది. ప్రభుత్వ స్థలాలనే ఆక్రమించే ఘనులున్నారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటే పరవాలేదు కానీ, వేరే దేశంలో ఉండి ఖాళీ స్థలం ఉంటే అది తమకు దక్కేది కష్టమేనని, చివరకు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం కూడా ఎన్ఆర్ఐలలో నెలకొంది. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో అనేక మంది భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అనేక భూ వివాదాలు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. దీంతో ఇతర దేశాలు, ప్రాంతాల్లో ఉండేవారు ఇక్కడ భూములపై అంత డబ్బు పెట్టేందుకు భయపడిపోతున్నారు. స్థానికులే కొద్దోగొప్పో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకే భూముల రిజిస్ట్రేషన్లు కూడా తెలంగాణలో తగ్గాయన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల అభిప్రాయం.
Next Story