Thu Nov 07 2024 02:37:10 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ బెజవాడను మించి పోయిందిగా.. ఇక ఎండలను ఆపేదెవరయ్యా?
బెజవాడ ఎండల తరహాలోనే హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా అనేక కారణాలున్నాయంటున్నారు పర్యావరణ వేత్తలు.
హైదరాబాద్ ఒకప్పుడు చల్లటి వాతావరణం ఉండేది. మండే ఎండల్లోనూ చల్లటి గాలి వస్తుండటంతో పాటు ఉక్కపోత వంటివి లేకపోవడం కారణంగానే హైదరాబాద్ కు ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది. కేవలం వాతావరణం కారణంగానే హైదరాబాద్ కు అత్యధిక మంది వలస వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బెజవాడలో ఎండలు బెంబెలెత్తిస్తుంటాయి. బెజవాడ ఎండల తరహాలోనే హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా అనేక కారణాలున్నాయంటున్నారు పర్యావరణ వేత్తలు. నగరాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చడంతో పాటు ఉన్న చెట్లను నరికి వేయడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒకప్పుడు చల్లటి వాతావరణం...
హైదరాబాద్ లో ఉండే వాతావరణం బెంగళూరు తరహాలో ఉండటంతోనే ఇక్కడ పారిశ్రామిక సంస్థలు కూడా అనేకం వచ్చాయి. కేవలం వాతావవరణ పరిస్థితుల వల్లనే కొద్దిరోజుల్లోనే కాస్మోపాలిటిన్ సిటీగా మారింది. అత్యధిక ఆదాయం రాష్ట్రానికి హైదరాబాద్ నగరం నుంచి వస్తుందంటే అంతకు మించి చెప్పడం అనవసరమే. కోటి జనాభా వరకూ దాటిన హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. బెజవాడ బెటర్ అన్న తరహాలో హైదరాబాద్ తయారయింది. ఇందుకు ప్రధాన కారణం చెట్లను అడ్డంగా నరికివేయడంతో పాటు అపార్ట్ మెంట్లు లెక్కకు మించి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెబుతును్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
హైదరాబాద్ నగరంలో గత ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలోనే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి కారణాలు కూడా అదే. ఉక్కపోత పెరగడానికి కూడా రీజన్ అదే. ఎండ వేడిమికి జనం అల్లాడి పోతున్నారు. గతంలో హైదరాబాద్ లో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే బయటకు రావడానికే భయపడిపోతున్నారు. అనేక రకాల కాలుష్యంతో పాటు వాతావరణంలో మార్పులు, చెట్ల నరికివేత కూడా ఈ ఉష్ణోగ్రతలు భారీగా పెరగడానికి కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ లో మంచినీరు దొరకడం కూడా హైదరాబాద్ లో కష్టంగా మారుతుందని కూడా భయపడిపోతున్నారు.
అర్బన్ హీట్ ఐలాండ్స్....
హైదరాబాద్ నగరంలో ఏడు ప్రాంతాలను హీట్ ఐలాండ్స్ గా గుర్తించారు. అర్బన్ హీట్ ఐలాండ్స్ ను గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మార్క్ చేశారు. వీటిలో బీఎన్ రెడ్డి నగర్, మైలార్ దేవ్ పల్లి, మన్సూరాబాద్, పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలిి, హయత్ నగర్ లను హీట్ ఐలాండ్స్ గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. ఈ ప్రాంతాల్లో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు గుర్తించారు. విపరీతంగా ఏసీల వినియోగంతో పాటు చెట్లను అడ్డంగా నరికివేయడంతో పాటు కాంక్రీట్ జంగిల్ గా మార్చడంతో ఈ పరిస్థితి దాపురించిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ నగరంలో హీట్ ఐలాండ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.
Next Story