Mon Jan 06 2025 11:15:00 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : "రియల్" వ్యాపారంలో మోసాలు.. మూడు వేల కోట్లు ముంచేసిన తీరు తెలుసా?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చీట్ చేస్తున్నాయి
హైదరాబాద్ నగరం రియల్ వ్యాపారానికి ఒక బేస్ లాంటిది. నగరం విస్తరిస్తున్న కొద్దీ వెంచర్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ రియల్టర్ల అవతారమెత్తి వెంచర్లు వేస్తున్నారు. పెద్దయెత్తున ప్రకటనలు చేయడమే కాకుండా, సెలబ్రిటీలతో చేత అడ్వర్టయిజ్ మెంట్ చేయిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలా వరకూ సక్సెస్ అవుతున్నారు. సెలబ్రిటీలు చెప్పడం వల్లనో, వెంచర్ ను చూసో? లేక ఆఫర్లు వినో తెలియదు కానీ అనేక మంది ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు కావాలనుకునే వారు ఖచ్చితంగా ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో...
ఇందుకోసం రియల్టర్లు పెద్దయెత్తున ఫ్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందు ఫ్లాట్ కు అడ్వాన్స్ ఇస్తే వచ్చే లాభాలను వివరిస్తూ పెద్దయెత్తున ప్రకటనలు చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని సంస్థలయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఉచితమని చెబుతారు. మరికొన్ని సంస్థలు కారు పార్కింగ్ ఉచితంగా ఇస్తామంటారు. మరికొందరు డెవలెప్ మెంట్ ఛార్జీలు తాము వసూలు చేయమని చెబుతారు. ఇంకొందరు మాడ్యులర్ కిచెన్ ను ఉచితంగా చేయిస్తామంటూ భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఎక్కువ మంది డెవలెప్ మెంట్ ఛార్జీలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలలో రాయితీలను ప్రకటిస్తూ కొనుగోలు దారులను ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. వారి మాయలో పడి ఎక్కువ మంది ముందుగా అడ్వాన్స్ లు చెల్లిస్తున్నారు.
పేరున్న సంస్థలు కూడా...
ఇటీవల కాలంలో పేరున్న సంస్థలు కూడా బోర్డులు తిప్పేస్తున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము వసూలు చేసుకుని పరారయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో అనేక కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో కొందరిని అరెస్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం న్యాయస్థానాన్నిఆశ్రయించి బెయిల్ పై బయటకు వచ్చి తిరిగి తమ వ్యాపారాలను చేసుకుంటున్నారు. వెంచర్లలలో ముందుగా డబ్బులు చెల్లించిన వారు మాత్రం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ తాము చెల్లించిన సొమ్ముల కోసం ప్రయత్నించి అలసి పోతున్నారు. ఇటీవల కాలంలో అనేక వెంచర్లు ఇలాగే మోసం చేస్తుండటంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలను నమ్మి కొనుగోలు చేయాలనుకునే వారు కూడా వెనక్కు తగ్గుతున్నారు.
కొనేవారు లేక...
వరసగా కేసులు నమోదవతుండటంతో వాస్తవంగా వ్యాపారం చేసే వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. ఎవరినీ నమ్మలేని పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువగా హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకున్న వారు సయితం ఇక్కడే ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకున్న వారు సయితం ఒకింత వెనకడగు వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందంటే.. రెడీ టు ఆక్యుపై అనే వెంచర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డబ్బులు చెల్లించడం వెంటనే ఇళ్లలో చేరేలా ఉన్న అపార్ట్ మెంట్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి కనపరుస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసు కేసు నమోదయిన కేసులు పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ సంస్థలు మూడు వేల కోట్ల రూపాయల మేరకు టోపీ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story