Mon Dec 23 2024 07:42:15 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రేపు ఉదయం వరకూ నిమజ్జనం .. ట్యాంక్‌బండ్ పై కోలాహలం
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వేలాది విగ్రహాలు ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాయి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వేలాది విగ్రహాలు ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాయి. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మొత్తం లక్ష విగ్రహాలకు పైగా నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ట్యాంక్‌బండ్ పైకి దాదాపు ముప్పయి నుంచి నలభై వేల విగ్రహాలు వచ్చే ఛాన్స్ ఉందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ట్యాంక్‌బండ్ పై ఎక్కడికక్కడ క్రేన్లను ఏర్పాటుచేసి వచ్చిన విగ్రహాలను వచ్చినట్లే నిమజ్జనం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనం పూర్తయిన వెంటనే హుస్సేన్ సాగర్ లో శుభ్రపర్చే కార్యక్రమాన్ని వెనువెంటనే ప్రారంభిస్తున్నారు.
అత్యధిక విగ్రహాలు...
ఖైరతాబాద్ గశేశ్ విగ్రహం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ పూర్తయినా ఇంకా నగరం నలుమూలల నుంచి అనేక విగ్రహాలు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకోవాల్సి ఉంది. ఎక్కడకక్కడ పోలీసులు వేగంగా గణనాధులను కదలిస్తున్నప్పటకీ విగ్రహాల సంఖ్య ఎక్కువ కావడంతో చార్మినార్, మొజంజాహి మార్కెట్, కోటి, ఆబిడ్స్ ప్రాంతాలకు వచ్చే సరికి కొంత స్లో అవుతున్నాయి. నిర్వాహకులు వేగంగా వెళ్లాలని భావిస్తున్నప్పటికీ యువత పెద్దసంఖ్యలో పాల్గొనడటంతో వాహనాల కదలిక నెమ్మదిగా సాగుతుంది. పోలీసులు అడుగడుగునా మొహరించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మ్యానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుంది.
Next Story