Fri Nov 22 2024 07:17:04 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పాఠశాలలకు సెలవు.. ఇళ్లనుంచి బయటకు రాకపోవడమే బెటర్
హైదరాబాద్ తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరం నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే వానతో తడిసిపోతుంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఒక్క ప్రాంతం అని లేకుండా ప్రతి ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీనగర్, నాగోలు, అల్కాపురి, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, ఖైరతాబాద్ పేట్ బషీరాబాద్ వంటి ప్రాతాల్లో భారీ వర్షం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎల్లో అలెర్ట్...
హైదరాబాద్ వాతావారణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కలసి రోడ్ల మీద నిలిచిన నీటిని బయటకు పంపుతున్నారు. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు వరకూ నీరు చేరడంతో రాత్రంతా నిద్రలేని రాత్రిని గడిపారు. రాంనగర్, పార్శీగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పార్శీగుట్టలో ఒక వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
నిన్నటి నుంచి...
నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఈరోజు కూడా భారీ వర్షం కురవడంతో అనేక పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. ప్రయివేటు పాఠశాలలలు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు. దీంతో నేడు పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించినట్లయింది. టోలీ చౌకీలో కొన్ని ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోవడం కనిపించింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే కేవలం భారీ వర్షం కురవడంతో ఈదురుగాలులు లేకపోవడంతో కొంత వరకూ ఊరటే అయినా ఈరోజు కార్యాలయాలకు వెళ్లేవారికి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.
మలక్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్, ముషీరాబాద్, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ముసారాంబాగ్, సంతోష్‌నగర్ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Next Story