Fri Nov 22 2024 08:06:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మూడు గంటలు ఏకధాటిగా వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
హైదరాబాద్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నగర ప్రజలు వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నగర ప్రజలు వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కురిసిన వానకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ నగరమంతా నిన్న కుండపోత వాన కురియడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతకూ వాన తగ్గకపోవడంతో పాటు నీళ్లన్నీ ఇళ్లలో చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ కురవనంత వర్షం నిన్న రాత్రి కురియడంతో ప్రజలు నిద్ర లేని రాత్రిని గడిపారు. కొన్ని చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు విద్యుత్తు వైర్లు కూడా తెగిపడిపోవడంతో రాత్రంతా విద్యుత్తు లేదు.
రహదారులన్నీ....
భారీ వర్షం మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. ఆరు గంటలకు ప్రారంభమయిన వాన రాత్రి 9 గంటల వరకూ ఆగకుండా పడటంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒక ప్రాంతమని కాదు.. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేకచోట్ల వాహనాలు నిలిచిపోయాయి. అయితే నిన్న ఆగస్టు 15 వతేదీ సెలవు దినం కావడంతో కార్యాలయాలు లేకపోవడం ఒకింత ఊరట కల్గించే అంశమైనా సెలవు దినం కావడంతో ఎక్కువ మంది సొంత వాహనాలతో బయటకు వచ్చివర్షంలో చిక్కుకుపోయారు. వారు ఇళ్లకు చేరేందుకు రాత్రికి పది గంటల సమయం పట్టింది.
అత్యధిక వర్షపాతం...
ఇక చిరు వ్యాపారుల తోపుడు బండ్లన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. ద్విచక్ర వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోతున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అత్యధికంగా హైదరాబాద్ లోని పాటిగడ్డలో 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. సరూర్ నగర్ లో 8.35 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 8.05, బంజారాహిల్్ లో 6.2, ఎల్బీనగర్ లో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈస్థాయిలో వర్షం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పడలేదని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మ్యాన్ హోల్ మూతల వద్ద కాపలా ఉండి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. 9 గంటల తర్వాత వర్షం ఆగడంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు.
Next Story