Sun Dec 22 2024 21:10:53 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. శనివారం కావడంతో కొంత రద్దీ లేకపోయినా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఎంతగా అంటే గంట నుంచి కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల డ్రైనేజీ నీరు ఉప్పొంగి రహదారులపై పొంగి పొరలుతూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మ్యాన్‌హోల్స్ మూతలను ఎవరూ తొందరపడి తెరవద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశించారు. పోలీసులు కూడా రోడ్లపైనే ఉండి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
రెండు రోజుల నుంచి...
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బి నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం దెబ్బకు వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. వర్షానికి ఎవరూ బయటకు రాకపోవడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. నిన్న రాత్రి కూడా రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉదయం కొంత ఎండ కాచినప్పటికీ రాత్రి అయ్యే సరికి వర్షం భారీగా పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల పాటు తెరిపించిన వానలు మళ్లీ మొదలయ్యే సరికి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితి మామూలుగా ఉండదు. అలాంటిది రెండు రోజుల నుంచి వర్షాలతో ప్రజలు చికాకు పడుతున్నారు.మరోవైపు దోమలు కూడా విజృంభిస్తుండటంతో విషజ్వరాలు చుట్టేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Next Story