Sun Dec 22 2024 19:08:26 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాదీలో భారీ వర్షం..రోడ్డు మీదకు వస్తే ఇక అంతే
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కొద్ది సేపటిక్రితం ప్రారంభమైన వర్షం కుంభవృష్టి కురుస్తుంది
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కొద్ది సేపటిక్రితం ప్రారంభమైన వర్షం కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీవర్షం పడుతుందని వాతావరణ శాఖ ఇందాకనే తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన వర్షం జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, అమీర్పేట్, లక్డాడీకాపూల్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్.బి. నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విధులకు హాజరయి...
మంగళవారం కావడంతో విధులకు హాజరయిన వారంతా తిరిగి బయలుదేరే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు మీదకు నీరు చేరడంతో వాహనాలు అనేక చోట్ల నెమ్మదిగా కదులుతున్నాయి. అంతే కాదు పలు చోట్ల వాహనాలు మొరాయించిన ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలను పక్కకు లాగి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కారణంగా అనేక మంది ప్రజలతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తమ సరుకు అమ్ముడు పోకుండా ఉండిపోయిందని అన్నారు.
మెట్రో రైళ్లు కిటకిట...
హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా సాయంత్రానికి భారీ వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పగలు పడుతుండటంతో కొంత నీటిని బయటకు తోడే ప్రయత్నం ఎవరికి వారే చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలెర్ట్ అయి రోడ్ల మీద నీరు వెంటనే తొలగించే ప్రక్రియను చేపట్టారు. మ్యాన్హోల్స్ మూతలను వారే తొలగిస్తూ నీరు వెళ్లిపోయేందుకు తోడ్పడతున్నారు. అయినా భారీ వర్షం కావడంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం అందుతుంది. గత కొద్ది రోజుల నుంచి వర్షం పడుతుండటంతో చాలా మందిసొంత వాహనాలను వదిలేసి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తుండటంతో వాటి రద్దీ విపరీతంగా పెరిగింది. మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి.
Next Story