Mon Dec 23 2024 13:27:24 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం... పండగ మీద ఎఫెక్ట్
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అనేక చోట్ల వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అనేక చోట్ల వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ తో పాటు అనేక చోట్ల భారీ వర్షం కురిసి రోడ్ల మీదకు నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు విధుల నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ వర్షం కురుస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా ఐకియా వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఒక్కసారిగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మ్యాన్‌హోల్స్ మూతలు ఎవరూ తీయవద్దని కోరారు.
అతి భారీ వర్షాలు కురుస్తాయని...
మరోవైపు వాతావరణ శాఖ సూచన మేరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో కొద్ది సేపటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. రేపు వినాయక చవితి కావడంతో వినాయక ప్రతిమలతో పాటు పత్రి, చిరు దుకాణాలన్నీ రహదారులపైనే ఉన్నాయి. అవన్నీ భారీ వర్షం దెబ్బకు తడిసి పోయాయి. ఈరోజు, రేపు వినాయకుడి ప్రతిమలు, పత్రిని అమ్ముకునేందుకు రోడ్ల మీదనే చిరు వ్యాపారులు తమ దుకాణాలను తెరిచారు. అయితే ఈ వర్షం రాకతో వారు ఇబ్బందులు పడుతున్నారు. పండగ కోసం పూలు, ఇతర సామాగ్రిని కూడా రోడ్లపై విక్రయిస్తుండటంతో అవన్నీ తడిసి ముద్దయి తీవ్ర నష్టం వాటిల్లిందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఉన్నట్లుండి వర్షం పడటంతో వారు సామాన్లు కూడా భద్రపర్చుకోలేకపోయారు. దీంతో తీవ్రమైన నష్టం వాటిల్లిందంటున్నారు. భారీ వర్షం కారణంగా అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
Next Story