Mon Dec 23 2024 10:51:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ట్యాంకర్ల కోసం క్యూ.. ఒక్కొక్క ట్యాంకర్ కు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి తలెత్తింది.
హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి తలెత్తింది. భూగర్భజలాలు ఎండిపోయాయి. బోర్లు పనిచేయడం లేదు. తాగునీరు కూడా తగినంత జలమండలి అధికారులు విడుదల చేయడంలేదు. గతంలో రోజు మార్చి రోజు తాగు నీటిని విడుదల చేసేవారు. అయితే దాదాపు రెండు గంటల సేపు నీటిని విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు గంట కూడా తాగు నీటిని విడుదల చేయడం లేదు. నీటి ధార కూడా తగ్గింది. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తింది. బెంగళూరు నగరం అంత కాకపోయినా ఆ స్థాయిలో నీటి ఎద్దడి ఇంకా తలెత్తకపోయినా నీటి అగచాట్లు మాత్రం నగరవాసులకు తప్పడం లేదు.
జలాశయాలన్నీ...
వర్షాలు కురియకపోవడంతో జలాశయాలన్నీ ఎండిపోయాయి. నీరు సక్రమంగా బోర్ల నుంచి అందడం లేదు. ఇంతకు ముందు గంటల కొద్దీ నడిచే బోర్లు ఇప్పుడు కనీసం అరగంట నడిచి నీరు లేక ఆగిపోతున్నాయి. దీంతో నగర వాసులు ట్యాంకర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్లను బుక్ చేసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక ట్యాంకర్ ను ఈరోజు బుక్ చేసుకుంటే మళ్లీ రెండు రోజుల పాటు ఆ ట్యాంకరు వారికి బుక్ కాదు. అదే సమయంలో ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రోజుకు 1.60 లక్షల ట్రిప్పులు ప్రస్తుతం ట్యాంకర్లు వేస్తున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులు ముందుగా బుక్ చేసుకుంటుండటంతో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.
అధిక సొమ్మును వసూలు చేస్తూ...
ఒక్ పెద్ద ట్యాంకర్ ను ఐదు వందల రూపాయలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ నిర్ణయించింది. అయితే ట్యాంకర్ తీసుకు వచ్చిన వారు మాత్రం జనాల నుంచి 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఇది ప్రయవేటు ట్యాంకర్ అంటూ నమ్మబలుకుతున్నారు. 650 రూపాయలు ఇస్తేనే ట్యాంకర్ నీళ్లు ఇస్తామని లేకుంటే వెనక్కు తీసుకెళతామని చెబుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు నగరవాసులు. మూడు రోజుల క్రితం బుక్ చేసినా ట్యాంకర్ రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో నగరంలో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. జలమండలి అధికారులు మాత్రం కేవలం కొన్ని ప్రాంతాల్లోనే నీటి ఎద్దడి ఉందని, ఆ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు.
Next Story