Mon Jan 06 2025 10:58:43 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ అందరికీ అనుకూలం.. అనువైన సిటీ.. అదే కారణమా?
హైదరాాబాద్ నగరం రోజురోజకూ విస్తరిస్తుంది. నలుమూలాలా పెరిగిపోతుంది
హైదరాబాద్ నగరంలో మూడు దశాబ్దాల క్రితం వరకూ స్థిరపడాలంటే కొంత జంకే వారు. అదే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి మించిన నగరం మరొకటి లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఒకప్పుడు ఏపీ నుంచి చెన్నై, బెంగళూరులకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పట్లో బెంగళూరు నగరం కూల్ గా ఉండటమే కాకుండా.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ఏపీ వాసులకు దగ్గరగా ఉండటంతో పాటు అన్నింటికీ అనుకూలంగా ఉండటం, బాష సమస్య అక్కడ లేకపోవడంతో అక్కడే ఎక్కువ మంది స్థిరపడిపోయారు. 1980వ నాటి వరకూ ఇదే పరిస్థితి. ఇక చెన్నై నగరం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని కావడంతో అక్కడ స్థిరపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
నాడు చెన్నై, బెంగళూరు నగరానికి...
తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికీ రెండు కోట్ల మందికి పైగా తెలుగు వాళ్లు స్థిరపడిపోయారు. అలాగే బెంగళూరు నగరంలోనూ కర్ణాటక రాష్ట్రంలోనూ రెండున్నర కోట్ల మంది తెలుగు వారున్నారు. వివిధ వృత్తుల్లో స్థిరపడిపోయిన వారు అనేక మంది అక్కడే మకాం వేశారు. తమ తర్వాత జనరేషన్లకు కూడా అక్కడే స్థానం కల్పించారు. అలా తెలుగు వారు ఎక్కువగా గతంలో బెంగళూరు, చెన్నై రాష్ట్రాలలో స్థిరపడిపోయే వారు. అప్పట్లో హైదరాబాద్ నగరంలో ఉండాలంటే ఒకింత భయం వేసింది. ఇక్కడ ఉర్దూభాష ఎక్కువగా ఉండటం వల్ల భాష సమస్య వల్ల కూడా కొంత మంది హైదరాబాద్ నగరానికి వచ్చేందుకు ఇష్టపడే వారు కాదు. తమకు తెలియని ప్రాంతంగా దీనిని భావించే వారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువ మంది ఏపీ వాసులు చెన్నై, బెంగళూరు నగరానికి వెళ్లి షాపింగ్ చేసుకునే వారు.
1990వ దశకం నుంచి...
కానీ 1990వ దశకం నుంచి పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ కు వలసల సంఖ్య పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటయిన చాలా రోజుల తర్వాత.. సుదీర్ఘ సమయం గడిచిన తర్వాత క్రమంగా హైదరాబద్ కు తాకిడి పెరిగింది. ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ మెరుగు కావడంతో క్రమంగా యువత రాక మొదలయింది. అంతకు ముందే తెలంగాణ ప్రాంతంలో కొందరు భూములు కొనుగోలు చేసి సేద్యానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి సేద్యం ప్రారంభించి ఇక్కడే స్థిరపడిపోయారు. ఇక అప్పటి నుంచి వారి రాకతో హైదరాబాద్ తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వలసల సంఖ్య పెరిగింది. ఇక 1990వ దశకం నుంచి వేగం మరింత పుంజుకుంది.
అన్నింటా నెంబర్ వన్...
ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరం అన్నింటా నెంబర్ వన్ గా నిలిచింది. విద్యకు, వైద్యానికి, ఉపాధికి కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ నగరం మారింది. ఉపాధి కార్మికుల నుంచి... ఐటీ నిపుణుల వరకూ ప్రస్తుతం ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్ అయి కూర్చుంది. అందుకే ఇక్కడ సెటిలయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు సయితం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిపోతున్నారు. వాతావరణంతో పాటు అన్ని వర్గాల వారికీ అనుకూలంగా ఉండే నగరం కావడంతో ఇప్పుడు సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల విజయానికి వీరే కారణమవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అలా హైదరాబాద్ నగరం అందరిదీ అయింది. అయితే ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లతో ఇప్పుడు భాగ్యనగరం మరింత భారంగా మారింది.
Next Story