Sat Nov 23 2024 04:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : తల్లీ...ఆమ్రాపాలీ... మా జేబులన్నీ ఖాళీ
హైదరాబాద్ నగరాన్ని వ్యాధులు ముంచెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దోమల బెడదే. డెంగ్యూ వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి
హైదరాబాద్ నగరాన్ని వ్యాధులు ముంచెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దోమల బెడదే. డెంగ్యూ వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దోమలు నగరంపై దాడి చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అవుట్ పేషెంట్ వార్డుల్లో కూడా ఏ ఆసుపత్రుల్లో చూసినా అతి పెద్ద క్యూలే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడం కూడా అసాధ్యమయిపోయింది. డబ్బులు పెట్టే స్థోమత ఉన్న వారిని కూడా సింగిల్ రూమ్ లు లేవని చెప్పి సిబ్బంది పంపించి వేస్తున్నారు. అత్యవసరమయితే తప్ప బెడ్స్ ను కూడా ప్రయివేటు ఆసుపత్రుల్లో కేటాయించలేని పరిస్థితులు హైదరాబాద్లో నెలకొన్నాయి.
డెంగ్యూ వంటి వాటితో...
విషజ్వరాలతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వాటితో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడబెట్టుకుని దాచుకున్నదంతా ఈ సీజన్ లో ఆసుపత్రులు, మందులకే సమర్పించుకునే పరిస్థితి వచ్చింది. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీల్ ఛెయిర్ నుంచి బెడ్స్ వరకూ, రక్త పరీక్షల నుంచి ప్లేట్లెట్స్ సమకూర్చడానికి ప్రత్యేక ఛార్జీలను నిర్ణయించి మరీ పిండేస్తున్నారు. దీంతో బీమా సౌకర్యం ఉన్న వారు తప్ప నగదు చెల్లించి ఆసుపత్రుల్లో చేరే వారికి మాత్రం ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ఆసుపత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ డాక్టర్ కు చూపించుకోవాలంటే గంటల కొద్దీ పేషెంట్ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలంటూ అంటే ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లడం మంచిదని సిబ్బంది నేరుగా చెబుతుండటం విశేషం.
దోమల దాడితో...
దీనికి ప్రధాన కారణం దోమల బెడద. ఈ ఏడాది ఈ సీజన్ లో అక్కడా, ఇక్కడా లేకుండా దోమలు హైదరాబాద్ నగరంపై దాడి చేస్తున్నాయి. పగలు లేదు.. రాత్రి లేదు. దోమల దెబ్బకు ప్రతి ఇంట్లో ఒక జ్వరపీడితులు ఉన్నారంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సక్రమంగా ఫాగింగ్ చేయకపోవడం, చెత్తా చెదారాన్ని సరైన సమయంలో తొలగించకపోవడం వంటివే ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటకు అడుగు పెడితే పట్టపగలే దోమల దాడికి గురై అనేక మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి అధికారిణిగా పేరున్న ఆమ్రాపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించినా అది జరగలేదు. కనీసం చెత్తను సకాలంలో తొలగించడం, బయటకాల్వల్లో స్ప్రే చల్లడం, ఫాగింగ్ వంటివి చేస్తే కొంత వరకూ దోమల బెడద తగ్గుతుందని మేడమ్ కు నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తాము దాచుకున్న సొమ్మునంతా ఆసుపత్రులకు, మందులకు ఖర్చుచేయాల్సి వస్తుందని, అప్పులు చేసి మరీ ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుందంటున్నారు హైదరాబాదీలు. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలంటున్నారు.
Next Story