Thu Nov 21 2024 13:01:02 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi : నగరం అంతా ఖాళీ... హైదరాబాద్ వీడి సొంతూళ్లకు.. రోడ్లన్నీ బోసిపోయి
హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. ట్రాఫిక్ పెద్దగా లేదు. సౌండ్ అంతగా వినిపించడం లేదు. సంక్రాంతి పండగకు జనం ఊరెళ్లారు
హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. ట్రాఫిక్ పెద్దగా లేదు. సౌండ్ అంతగా వినిపించడం లేదు. వాహనాల రద్దీ రహదారులపై లేదు. ఇదీ ఈరోజు హైదరాబాద్ లో పరిస్థితి. సంక్రాంతి పండగకు అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో నగరం దాదాపుగా ఖాళీ అయినట్లే. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. కిక్కిరిసిపోయి నిత్యం కనిపించే మెట్రో రైళ్లు కూడా ఖాళీగా కదులుతున్నాయి. దీనికి అంతటికీ కారణం సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగకు నగరమంతా ఊరిబాట పట్టారు.
సొంతూళ్లలోనే...
ప్రధానంగా హైదరాబాద్ లో నివసించే వారు ఎక్కువగా తమ సొంతూళ్లలోనే సంక్రాంతి పండగ జరుపుకుంటారు. ఏడాది అంతా ఇక్కడ ఉపాధి అవకాశాలు పొంది విసిగిపోయిన వారికి సంక్రాంతి పండగ ఎంతో రిలీఫ్ ఇస్తుంది. సొంతూళ్లకు వెళ్లి తమ బంధుమిత్రులను కలుసుకుని ఆనందంగా గడిపే సమయాన్ని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. అందుకే సంక్రాంతి పండగకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు.. లేకుంటే సొంత వాహనాల్లో అయినా బయలుదేరి వెళుతుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో...
సంక్రాంత్రి పండగ గ్రామీణ వాతావరణంలోనే జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నగరంలో గ్రామీణ వాతావరణం సృష్టించేందుకు కొందరు తంటాలుపడుతున్నా అది కృతకంగానే ఉంటుంది. అంతే తప్ప సొంతూళ్లకు వెళ్లి.. ప్రయాణం చేస్తేనే అందులో మజా ఉంటుంది. తమ గ్రామాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయే సందర్భమిది. తాము చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో తిరగడం అంటే పెరిగిన వయసు మర్చిపోయి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తాయి. అందుకే సంక్రాంతి పండగ కోసం సంవత్సరమంతా ఎదురు చూస్తుంటారు.
వరస సెలవులు రావడంతో...
పెద్దల నుంచి పిల్లల వరకూ కుటుంబాలన్నీ కలసి చేసుకునే పండగ కావడంతో అందరూ పల్లెబాట పడతారు. అందులో వరసగా సెలవులు రావడం కూడా ఇందుకు ఒక కారణం. ఇన్ని సెలవులు మరే పండగకు రావు. వచ్చినా పల్లెల్లో అంత జోష్ ఉండదు. అందుకే హైదరాబాద్ నుంచి ఇచ్ఛాపురం వెళ్లే ప్రతి బస్సు కిటికిటలాడిపోతుంది. ఇక కోడిపందేలు.. బండ లాగుడు పోటీలు.. కబడ్డీ ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందడిని మిస్ అవుతామని భావించి అందరూ ఇంటి బాట పడతారు. అందుకే ఇప్పుడు నగరం నిశ్శబ్దంగా మారింది.
Next Story