Mon Dec 23 2024 00:42:38 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ ను వీడని వర్షం.. కుండపోతతో స్థంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడటం లేదు. ప్రతి రోజూ వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడటం లేదు. ప్రతి రోజూ వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వాసులకు వర్షం చుక్కలు చూపిస్తుంది. మధ్యాహ్నం గంటన్నర పాటు దంచికొట్టిన వర్షంతో వీధులన్నీ జలమయ్యాయి. ప్రధాన వీధుల్లోకి నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఐకియా సెంటర్, షేక్పేట్, ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మొహిదీపట్నం, ఎల్బి నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అనేక వ్యాపార సముదాయాల్లోకి నీరు వచ్చి చేరడంతో వాహనాలన్నీ నీళ్లలో తడిసి పోయాయి.
వాహనాలు మొరాయించి...
దీంతో వాహనాలు స్టార్ట్ కావడానికి మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నగరంలోని రహదారులపై వర్షపు నీరు మోకాళ్ల పైనే నీరు నిలిచిపోవడంతో వాహనాలు కదిలేందుకు గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. రహదారులపై వాహనాలన్నీ నెమ్మదిగా సాగుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించి పోయింది. కొన్ని వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలు, ఆఫీసులు వదిలి పెట్టే సమయం కావడటంతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
రోడ్లపైకి నీరు...
ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. రహదారులకు రెండు వైపుల వర్షపు నీరు నిలిచి పోయి ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇప్పటికే వాతావరణ శాఖ భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అలెర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ ను క్రమంగా పంపించి వేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత విడతల వారీగా బయటకు వస్తే మంచిదని చెబుతున్నారు. ఈరోజు రాత్రికి కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురి చేశారు.
Next Story