Fri Nov 22 2024 04:54:41 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రా మళ్లీ జూలు విదులుస్తుందా? ఎప్పుడంటే?
హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మళ్లీ కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మళ్లీ కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. హైకోర్టులో కేసులు ఉన్న వాటిని తప్పించి మిగిలిన ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా హైడ్రా కూల్చివేతల ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణలో అతి పెద్ద పండగ దసరా రావడంతో పాటు వివిధ కోర్టు తీర్పులతో కొంత ఆలస్యం చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే హైడ్రా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేతలను చేపట్టి దాదాపు యాభై ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. విల్లాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలను కూల్చివేసింది.
అనేక ఇబ్బందుల మధ్య
అయితే హైడ్రా కూల్చివేతలకు అనేక ఇబ్బందులు వచ్చాయి. న్యాయపరమైన ఇబ్బందులు మాత్రమే కాకుండా, చట్ట బద్ధత ఆ సంస్థకు ఏది అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను హైడ్రాపై జారీ చేసింది. హైడ్రాకు సర్వాధికారాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీలో హైడ్రా పై తీర్మానం కూడా చేయనున్నారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో పాటు తెలంగాణ సర్కార్ హైడ్రా కు అదనపు సిబ్బందిని నియమించింది. కూల్చివేతల సమయంలో అన్ని నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని సూచించింది. ముందుగా నోటీసులు ఇవ్వడంతో పాటు భవనాల్లో ఉన్న సామాన్లను తొలగించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
రాజకీయ రంగు...
మరోవైపు హైడ్రా కు రాజకీయ రంగు పులుముకుంది. ఈరోజు హైడ్రా కూల్చివేతలు, మూసీ నది సుందరీకరణపై బీఆర్ఎస్ హైదరాబాద్ నేతలు సమావేశం అవుతున్నారు. అదే సమయంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ నేతలతో సమావేశమై హైడ్రా కూల్చివేతలపై చర్చించనున్నారు. ఇటు అధికార పార్టీ కూల్చివేతలను చేపట్టాల్సిందేనని గట్టిగా భావిస్తుంది. భవిష్యత్ లో చెన్నై, బెంగళూరు నగరంలా హైదరాబాద్ మారకూడదంటే కూల్చివేతలను చేపట్టాలని, ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కూల్చివేతలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజలకు అండగా నిలవాలని భావిస్తుంది. హైడ్రా అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఏర్పాటు చేసిందని అది ఆరోపిస్తుంది.
త్వరలోనే కూల్చివేతలు...
అయితే ఈ నేపథ్యంలో హైడ్రా అతి త్వరలోనే తిరిగి కూల్చివేతలను ప్రారంభించేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన వాటిని తొలగించేందుకు సిద్ధమయింది. ఇందుకోసం ముందుగా హైడ్రా అధికారులు రూట్ మ్యాప్ ను రూపొందించుకుంటున్నారు. వరసగా కూల్చివేతలు చేపట్టాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ఆక్రమణదారులకు నోటీసులు తయారు చేసే పనిలో ఉన్నారు. దీపావళి పండగ తర్వాత కూల్చివేతలు ప్రారంభమవ్వవచ్చని కొందరు చెబుతుండగా, మరో రెండు, మూడు రోజుల్లోనే కూల్చివేతలు స్టార్ట్ అవుతాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ జూలు విదల్చనుందని తెలిసింది.
Next Story