Tue Nov 26 2024 19:57:35 GMT+0000 (Coordinated Universal Time)
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ ఏకంగా 3.25 కోట్లు నొక్కేశారు
వైట్‌హౌస్‌లో పనిచేస్తున్న బంధువు సాయంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని
వైట్‌హౌస్‌లో పనిచేస్తున్న బంధువు సాయంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పిన జంట నగరంలోని ఓ కుటుంబాన్ని మోసం చేసింది. సుమారు రూ.3.2 కోట్లు లాగేసుకున్నారు. కుమారుడికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తారని నమ్మి కోట్ల రూపాయలను సమర్పించేసుకున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ (పేరు మార్చాం)కు పి.రఘురాం, పి.సునీత అనే దంపతులతో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ప్రసాద్ తన కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడని.. అతడిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. USAలో ఏదైనా ‘మేనేజ్మెంట్ కోటా’ సీట్లు దొరుకుతాయా అని అడిగాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ దంపతులు స్టాన్ఫోర్డ్లోని టాప్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రసాద్‌ను నమ్మించారు. తమ బంధువు సుమంత్ అమెరికాలోని వైట్‌హౌస్‌లో పనిచేస్తున్నాడని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫీజును తగ్గించేందుకు అతడు సహకరిస్తానని ప్రసాద్‌కి చెప్పారు.
అండర్ గ్రాడ్యుయేట్ సీటుకు మేనేజ్మెంట్ కోటాలో సొంతం చేసుకోవాలంటే రూ. 3.25 కోట్లు అవుతుందని దంపతులు తెలియజేశారు. సుమంత్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం యూనివర్శిటీకి ఇప్పటికే చెల్లించామని.. మీరు డబ్బులు ఇవ్వండని కోరారు. ఈ జంట ప్రసాద్ నుండి వివిధ సందర్భాల్లో రూ. 3.2 కోట్లు లాగేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అడ్మిషన్ ఇప్పించలేకపోయామని చెప్పారు. బదులుగా మరిన్ని షరతులు విధించడం, ఇంకాస్త డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. డబ్బులు కట్టినా కూడా మీ పిల్లాడు 1600 SAT స్కోర్లలో 1500 కంటే ఎక్కువ స్కోర్‌ను సాధించాలనే కొత్త షరతును పెట్టారు. దీంతో బాధితులు షాక్ అయ్యారు. అయినా కూడా ఈ జంట ప్రసాద్ కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించింది. సిమ్లా, బెంగుళూరు, కాంచీపురం వంటి అనేక ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లారు.
కంచి కామాక్షి ఆలయ ప్రధాన పూజారి నటరాజ శాస్త్రితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఈ దంపతులు చెప్పుకునేవారు. ఆయన తమ ఫ్లాట్‌ను సందర్శించేవారని చెప్పడంతో ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు భక్తి ముసుగులో ఈ జంటను నమ్మేశారు.
యూనివర్శిటీ ప్లానింగ్ సరిగ్గా కుదరకపోవడంతో ప్రసాద్.. రఘురామ్ ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈసారి రఘురామ్ USA కు వెళ్లి అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేస్తానని అన్నాడు. రెండు రోజుల తర్వాత అతను ప్రసాద్‌కి వాట్సాప్ కాల్ చేసి, మార్కులు తక్కువగా రావడంతో స్టాన్ఫోర్డ్లోని అడ్మిషన్స్ ఆఫీసర్ అండర్ గ్రాడ్యుయేట్ సీటు ఇవ్వలేదని, షరతులతో కూడిన అడ్మిషన్‌పై సౌత్ కరోలినా విశ్వవిద్యాలయంలో మరొక అడ్మిషన్ ఇప్పిస్తానని తెలిపాడు. రఘురామ్ స్టాన్ఫోర్డ్ ఫీజులకు సంబంధించిన ఫోటోను పంపాడు. అందులో 9.5 మిలియన్ US డాలర్లు ఖర్చవుతుందని ఉంది. అంటే భారతదేశ కరెన్సీలో సుమారు 76.30 కోట్ల రూపాయలు. అంత చెల్లించడానికి ప్రసాద్ నిరాకరించాడు.
కొంత సమయం తర్వాత రఘురాం మళ్లీ Whatsappలో ప్రసాద్‌కి కాల్ చేసి, అంత ఖర్చు అయితే ఉండదని.. సుమంత్ 25% డిస్కౌంట్ ఇవ్వాలని వైట్‌హౌస్‌లోని ఓ అధికారితో మాట్లాడాడని.. డిస్కౌంట్ పోను ఫీజు 7.125 మిలియన్ అమెరికన్ డాలర్లకు తగ్గించామని చెప్పాడు. ఇంతకు ముందు చెల్లించిన మొత్తాన్ని కలుపుకుంటే 6.865 మిలియన్ USD (సుమారు 55 కోట్లు) చెల్లించాల్సి వచ్చిందన్నారు.
కొద్దిసేపటికి రఘురామ్ కెమికల్ ఇంజనీరింగ్ కోసం స్టాన్‌ఫోర్డ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటు కోసం 36 కోట్లు చెల్లించినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. వారు చెప్పిన మొత్తం 55 కోట్లు ఇవ్వాలని అడగడం ప్రారంభించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి డబ్బులు చెల్లించామని చెబుతున్నారు కదా.. రుజువులు చూపించాలని ప్రసాద్ అడగడం మొదలుపెట్టాడు. ఆధారాలు చూపిస్తే డబ్బు చెల్లిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో తన కుమారుడికి అడ్మిషన్ సీటు ఇప్పిస్తానన్న నెపంతో భారీ మొత్తంలో ఈ దంపతులు డబ్బులు వసూలు చేశారని మోసాన్ని గుర్తించారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story