పోటెత్తిన వరద.. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ : నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది.
హైదరాబాద్ : నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే హిమాయత్ సాగర్ రెండు గేట్లను శుక్రవారం ఎత్తివేసి అదనపు నీటిని విడుదల చేశారు. మూసీ నదికి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో.. మూసీ ప్రవాహం పెరగనుంది. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్లలో జూలై 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.20 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్‌లో 1100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది.
హుస్సేన్ సాగర్ నిండిపోయింది
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు కూడా నిండుకుండలా నిండిపోయింది. సరస్సు శుక్రవారం 514.75 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్)ను తాకింది. నీటిమట్టం, నీటి విడుదలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కమిషనర్ రోనాల్డ్ రోస్తో రాష్ట్ర మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ పరిస్థితిని సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ డిశ్చార్జి చానెళ్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాలతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్.. నీటి కాలువల ద్వారా విస్తారంగా ఇన్ ఫ్లోలను అందుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులతో కలిసి హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టాలు, విడుదలను జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించారు.