Mon Dec 23 2024 18:52:58 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : న్యూ ఇయర్ వేడుకలకు ఈ పనిచేశారో.. ఇక అంతే
హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి వేడుకలకు హోటళ్లు, పబ్ లు సిద్ధం చేస్తున్నాయి.
దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచే వేడుకలకు అన్ని హోటళ్లు, పబ్ లు సిద్ధం చేస్తున్నాయి. ప్రయివేటు సంస్థలు కూడా వేడుకలను నిర్వహించేందుకు పూనుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వేడుకల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లను అమ్మే ప్రక్రియను ప్రారంభించాయి. వేడుకలలో మద్యం సరఫరాతో పాటు మంచి రుచికరమైన భోజనంతో పాటు మెగా ఈవెంట్‌ను చేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి.
వేల రూపాయలు...
ప్రధానంగా సాఫ్ట్వేర్ సంస్థలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించి నాలుగు రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ప్రయివేటు సంస్థలు రకరకాల ఆఫర్లు ఇస్తూ యువతను ఊరిస్తున్నాయి. కాంబో ప్యాక్ లను రెడీ చేశాయి. మ్యూజిక్ ఈవెంట్లతో పాటు డిసెంబరు 31వ తేదీ రాత్రంతా వేడుకలను నిర్వహించేందుకు వివిధ రకాలుగా ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకోసం వేల రూపాయల వరకూ టిక్కెట్లను నిర్ణయించాయి. ధర ఎంతైనా సంవత్సరం చివరి రోజు ఎంజాయ్ చేసేందుకు యువత క్యూ కడతారన్న నమ్మకంతో ప్రయివేటు సంస్థలు పోటీలు పడి మరీ ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయాలు జరుపుతున్నాయి.
అనుమతి ఉంటేనే....
అయితే వీటిలో పోలీసుల అనుమతి లేకుండా కొన్ని సంస్థలు టిక్కెట్లు ఆన్ లైన్ లో అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు న్యూ ఇయర్ వేడుకలపై వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. అనుమతి తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. అందుకే టిక్కెట్లు కొనుగోలు చేసే ముందు ఆ ఈవెంట్‌కు పోలీసుల అనుమతి ఉందా? లేదా? అన్నది చూసుకోవాల్సి ఉంటుంది.
Next Story