Mon Dec 23 2024 13:44:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఇన్నాళ్లకు సరైనోడు దొరికాడు.. చేయిచాస్తే బదిలీ వేటు.. ఖాకీ డ్రస్ నిటారుగా నిలబడిందిగా
హైదరాబాద్ పోలీసులు ఒక గాడిలో పడుతున్నట్లే కనపడుతుంది. పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన పవరెంటో చూపిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులు ఒక గాడిలో పడుతున్నట్లే కనపడుతుంది. పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన పవరెంటో చూపిస్తున్నారు. అవినీతి మాట వినపడితే చాలు.. బదిలీవేటు వేయడమే.. ఎన్నాళ్ల నుంచో పాతుకుపోయిన వ్యవస్థను కొత్త మార్గంలో నడిపించేందుకు కొంత ప్రయత్నమయితే కొత్వాల్ మొదలు పెట్టినట్లే కనపడుతుంది. అందుకోసమే పోలీసు కమిషనర్ నుంచి గతంలో మాదిరి ఫోన్ రావడం లేదు.. ఏకంగా ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. అది ట్రాన్స్ఫర్ ఆర్డరో.. లేదంటే సస్పెన్షన్ ఉత్తర్వులోనని కవర్ తెరిచి చూసే వరకూ పోలీసులకు గుండెలు లబ్ డబ్ మంటూనే ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు
నివేదికలు తెప్పించుకుని...
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరి కోరి కొత్తకోట శ్రీనివాసులురెడ్డిని నియమించింది. ఆయన వచ్చీ రాగానే తొలుత తన కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిస్థితులను తెలుసుకున్నారు. తనకున్న ప్రత్యేక వ్యవస్థల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. స్టేషన్ లో ఏం జరుగుతుంది? ప్రజల పట్ల ఎలా పోలీసులు మసలు కుంటున్నారు? కేసులను సత్వరమే పరిష్కరిస్తున్నారా? సివిల్ కేసుల పంచాయతీని కూడా చేస్తున్నారా? వంటి విషయాలపై ఆయన తాను ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నుంచి సమాచారం తెప్పించుకుని మరీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు.
మూకుమ్మడి బదిలీలు...
తనకు వచ్చిన సమాచారం కరెక్టేనని తేలితే వెంటనే చర్యలకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 54 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో బదిలీలు ఒక్కసారి చేయరు. కానీ కొత్తకోట మాత్రం కొరడా ఝులిపించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక అవార్డులు అందుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ సిబ్బందిపై మామూలుగా చర్యలు తీసుకోలేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 85 మందికి బదిలీ ఉత్తర్వులు అందచేశారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకూ ఏ ఒక్కరినీ వదలలేదు. అవినీతికి పాల్పడితే సహించబోనని ఆయన ఈ రూపంలో చేస్తున్న హెచ్చరికలు ఖాకీ డ్రస్‌ను నిటారుగా నిలబడేలా చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. శభాష్ సర్.. అంటూ ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Next Story