Mon Dec 23 2024 11:08:07 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : ఐదు సెకన్లలోనే ఐదంతస్థుల భవనం నేలమట్టం.. అదీ హైడ్రా "పవర్"
హైడ్రా మళ్లీ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిన్న ఒక్కరోజు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చింది
హైడ్రా మళ్లీ ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిన్న ఒక్కరోజు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చింది. దాదాపు ఎనిమిది ఎకరాలను కేవలం ఒక్కరోజులోనే ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. ఈ ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించినవే. అన్ని వ్యాపార సముదాయాలే. నివాసాల జోలికి హైడ్రా పోవడం లేదు. ఈ విషయాన్ని హైడ్రా అధికారులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఐదంతస్థుల భవనాలను కేవలం ఐదు సెకన్లలోనే కూల్చివేసే బుల్డోజర్లు, జేసీబీలతో హైడ్రా అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతుంది. దీంతో అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఎనిమిది ఎకరాలను...
గత కొద్ది రోజుల నుంచి కొంత శాంతించిన హైడ్రా తిరిగి నిన్న ఆదివారం నుంచి కూల్చివేతలను ప్రారంభించింది. కూకట్పల్లి, అమీన్పూర్ లలో హైడ్రా అనేక నిర్మాణాలను కూల్చివేసింది. ఎక్కువ మంది చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపార సముదాయాలను నిర్మించుకున్నారు. బహుళ అంతస్థుల భవనాలను నిర్మించారు. వారికి ముందుగా నోటీసులిచ్చిన హైడ్రా అధికారులు ఆదివారం తెల్లవారు జాము నుంచే కూల్చివేతలను ప్రారంభించి రాత్రికి పూర్తి చేయగలిగారు. కూకట్పల్లి, అమీన్పూర్ లో ఎక్కువగా ఈ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని తమ పనని పూర్తి చేయడం ప్రారంభించగానే కొంత అడ్డుపడినా, పోలీసుల సాయంతో వారిని అవతలకు పంపగలిగారు.
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో...
ీమూసీ నది పరివాహక ప్రాంతంలోనూ హైడ్రా కూల్చివేతలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను కూల్చివేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు పన్నెండు వేల ఆక్రమణలను ఉన్నట్లు హైడ్రా ఇప్పటికే గుర్తించింది. వీటిని తొలగించాలని ఇప్పటికే సంబంధిత నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే కూల్చివేతలతో నివాసాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూంలను వేరే చోట ఇవ్వాలని నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆక్రమణదారులు కూడా సహకరించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. దీంతో పాటు హైడ్రాకు హైదరాబాద్లో అనేక ఆక్రమణలపైన ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపైన కూడా ఫోకస్ పెట్టనుంది.
Next Story