Mon Dec 23 2024 10:55:24 GMT+0000 (Coordinated Universal Time)
Summer : ఫిబ్రవరి మొదటి వారంలోనే టీజర్ రిలీజ్ చేసిన సూరీడు... అసలు సినిమా ముందుంది
హైదరాబాద్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి మొదట ివారంలోనే ఎండల తీవ్రత, ఉక్కబోత మొదలు కావడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు కొంత మొదలవుతాయి. కానీ మొదటి వారం నుంచే దంచేస్తున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఎండాకాలం మొదలయినట్లేనని చెబుతున్నారు.
35 డిగ్రీల ఉష్ణోగ్రతలు...
తెలంగాణ స్టేట్ డెవలెప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, రాజేంద్ర నగర్, చార్మినార్, సరూర్నగర్, కాప్రా లలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇన్నాళ్లు ఫ్యాన్ వేసుకోవడానికే వణికిపోయిన ప్రజలు ఇప్పుడు ఏసీలు ఆన్ చేసే పరిస్థితికి వచ్చారంటే అతిశయోక్తి కాదు. విద్యుత్తు బిల్లులు కూడా తడిసి మోపెడవుతాయి. చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో...
సాధారణంగా శివరాత్రికి చలి పోతుందంటారు. కానీ ఇప్పుడే చెమట మొదలయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న కాలంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనన్న భయం ప్రజల్లో నెలకొని ఉంది. ఈ ఏడాది ఎండాకాలం ఎలా ఉందో ట్రయల్ చూపిస్తుందని సోషల్ మీడియాలో అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందన్న భయం నెలకొంది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, రామగుండం ప్రాంతంలో కూడా భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఎండల తీవ్రత ఈ ఏడాది ఎలా ఉంటుందో ఫిబ్రవరి మొదటి వారంలోనే కనిపిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story