Mon Dec 23 2024 07:46:31 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్.. మరో బెజవాడగా మారిందా?
ఇది మే నెలా? అక్టోబర్ మాసమా? చాలా మందికి కలుగుతున్న సందేహం. హైదరాబాద్ ఉక్కపోతతో అల్లాడి పోతుంది
ఇది మే నెలా? అక్టోబర్ మాసమా? చాలా మందికి కలుగుతున్న సందేహం. అక్టోబరులోకి వచ్చిన ఎండలు తగ్గుముఖం పట్టలేదు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్కపోతతో ఊపిరితీస్తుంది. సీజన్ అంటే ఎలా ఉండాలి? జూన్, జులై వరకూ ఎండలు మండి పోవడం సహజమే. తర్వాత క్రమేపీ వర్షాలు మొదలయి అనంతరం చలి ప్రారంభమవుతుంది. శివరాత్రి వెళ్లిన నాటి నుంచి చలి మరింత ఎక్కువవుతుందంటారు. కానీ అక్టోబరులోకి ప్రవేశించిన హైదరాబాద్ నగరంలో ఉక్కపోత వదలడం లేదు.
ఉక్కపోతతో...
దీంతో ప్రజలు చెమటతో ఇబ్బందులు పడుతున్నారు. పగలు ఎండ, తెల్లావారు జామున చలి. ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఇక అక్టోబరు మాసంలోనూ విద్యుత్తు వినియోగం ఎక్కువగానే కనపడుతుంది. అందరూ ఏసీలు, ఫ్యాన్లు నిరంతరం వాడుతుండటంతో విద్యుత్తు వినియోగం గత అక్టోబరు నెల కంటే ఈసారి అధికంగా ఉందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలల నుంచి విద్యుత్తు వినియోగం మరింత పెరిగిందని అంటున్నారు. దీనికి కారణం వాతావరణంలో నెలకొన్న మార్పులే.
విద్యుత్తు బిల్లులు...
అక్టోబరు నెలలో సహజంగా విద్యుత్తు బిల్లులు తక్కువగా వస్తాయి. కానీ ఈసారి మాత్రం అక్టోబరు నెలలో విద్యుత్తు బిల్లులు వాచి పోతున్నాయి. వేలల్లో బిల్లులు వస్తుండటంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. వాతావరణ కాలుష్యం, చెట్లను నరికివేయడం, కాంక్రీట్ జంగిల్ గా మారడం వల్లనే హైదరాబాద్లో ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిపుణుల అభిప్రాయం. ఒకప్పుడు హైదరాబాద్ కూల్ గా మంచి వాతావరణంలో ఉండేది. కానీ ఇప్పుడు బెజవాడను హైదరాబాద్ తలపిస్తుంది.
వైరల్ ఫీవర్...
ఫ్యాన్ లేనిదే జనం ఉండలేకపోతున్నారు. రాత్రి వరకూ ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఎండలు ఠారెత్తిస్తుండటంతో నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఇకరు జ్వరపీడితుడు కూడా ఉంటున్నారు. వైరల్ ఫీవర్ తో నగరం వణికిపోతుంది. అసలు ఈ సీజన్ లో కూల్ గా ఉండాల్సిన హైదరాబాద్ హాట్ హాట్ గా మారిపోవడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
Next Story