Mon Dec 23 2024 08:28:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : చినుకు పడితే చాలు వణుకే.. భయపడిపోతున్న హైదరాబాదీలు
హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుంది. రహదారులపై నీళ్లన్నీ నిలిచిపోతున్నాయి
హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుంది. రహదారులపై నీళ్లన్నీ నిలిచిపోతున్నాయి. ఇక కుండపోత వాన కురిస్తే చాలు ఇక హైదరాబాద్ లో ప్రయాణం చాలా కష్టం. ప్రయాణం మాట సంగతి దేవుడెరుగు.. అసలు ఇంట్లో ఉండేందుకే భయపడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. రహదారుల్లో నీళ్లు నిండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
రెండు రోజులుగా...
గత రెండు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి నగర వాసులు భయపడి పోతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక హైటెక్ సిటీ, ఐకియా షోరూం దగ్గర అయితే వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. సాయంత్రం వేళ గత రెండు రోజుల నుంచి సరిగ్గా ఆఫీసులు వదిలే సమయానికి వర్షం పడుతుండటంతో అనేక మంది ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. ఇంటికి చేరే సరికి గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ నీరు ఉప్పొంగి...
ఇక డ్రైనేజీ నీరు ఉప్పొంగి రహదారులన్నీ జలమయంగా మారడంతో ట్రాఫిక్ ఎక్కడకక్కడ నిలిచిపోతుంది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రాలేకపోతున్నారు. డ్రైనేజీ, వర్షపు నీరు కలసి ఇళ్లలోకి నీరు వస్తుండటంతో ఒకరకమైన దుర్గంధం నెలకొని ఉందని స్థానికులు వాపోతున్నారు. అసలే దోమల బెడదతో డెంగ్యూ మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు సోకుతుండటంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమల బెడద మరింత తీవ్రమయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తను తొలగించకపోవడం వల్ల కూడా దోమల ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story