Mon Dec 23 2024 02:28:57 GMT+0000 (Coordinated Universal Time)
Fire Accident : అపార్ట్మెంట్ వాసులదే తప్పంటున్న అగ్నిమాపక శాఖ . .. ఫిర్యాదు చేయకుంటే ఎలా?
నాంపల్లిలోని బజార్‌ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదానికి మానవతప్పిదమే కారణమని చెప్పక తప్పదు
నాంపల్లిలోని బజార్‌ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదానికి మానవతప్పిదమే కారణమని చెప్పక తప్పదు. కుటుంబాలు నివాసముంటున్న అపార్ట్మెంట్ లో కెమికల్ నిల్వలు ఉంచడం ప్రమాదానికి ముఖ్య కారణం. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు చెబుతున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్మెంట్ సెల్లార్ లో వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. ఇది ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి ఈ వ్యాపారం నిరాటంకంగానే కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, మరి ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది.
ఆ రెండు ఫ్లోర్లలోనే...
అయితే ఒకటి, రెండో ఫ్లోర్ కు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటి వరకూ తొమ్మిది మంది మరణించగా, వీరిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. కారు రిపేరు చేస్తుండగా చెలరేగిన నిప్పురవ్వ ఈ ప్రమాదానికి కారణమయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ భవనంలో మొత్తం ఎనిమిది ఫ్లాట్లలో యాభై మంది నివాసముంటున్నారు. నాలుగు అంతస్థుల్లో ఈ భవనం ఉంది. అయితే మంటలు వ్యాపించిన సమయంలో కొందరు తప్పించుకోగా, మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు.
ఫిర్యాదు చేస్తే...
కానీ భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఫిర్యాదు చేయకపోవడం ఏమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యాపారాలు చేసుకుంటుంటారని, అటువంటి వారిపై తమకు ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లో కెమికల్ ను నిల్వ చేయడం నేరమని అగ్నిమాపక సిబ్బంది సయితం చెబుతున్నారు. ఆయిల్ అంతా కిందపడి పోవడంతో వారు కూడా సహాయక కార్యక్రమాలు వెంటనే చేపట్టలేకపోయారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఈ ప్రమాదానికి కెమికల్స్ నిల్వ ఉంచిన రమేష్ జైశ్వాల్ ఎంత కారణమో... ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉన్న అపార్ట్మెంట్ వాసులదీ అంతే తప్పని అధికారులు చెబుతున్నారు.
Next Story