Mon Dec 23 2024 05:59:17 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : వామ్మో.. ఇదెక్కడి వర్షం.. గంటసేపు బీభత్సం చేసిందిగా..?
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు కురిసిన వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు కురిసిన వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించింది. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలితో పాటు భారీ వర్షం కురవడంతో ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్తును నిలిపేశారు. దీంతో అనేక ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచాయి. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపైన పడ్డాయి.
ఇళ్లలోకి నీళ్లు...
హైదరాబాద్ నగరం వానతో తడిసి ముద్దయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ జోరువానతో అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచి పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మలక్ పేట్ వద్ద రహదారిపై నీళ్లు నిలవడంతో గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారుల తమ దుకాణాల్లో ఉన్న సరుకును కూడా వదిలేసి పక్కా భవనాల వద్ద తలదాచుకున్నారు. అనేక చోట్ల నీళ్లన్నీ ఇళ్లలోకి రావడంతో ప్రజలు వాటిని బయటకు పంపేందుకు కుటుంబ సభ్యులందరూ కలసి ప్రయత్నిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్య..
తోపుడు బండ్ల వ్యాపారులు సయితం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొన్నటికంటే ఈరోజు అధికంగా వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ఉదయం కొంత ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి భారీ వర్షం నమోదయింది. దీంతో అనేక ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి చేరాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్హోల్స్ మూతలను తెరిచి రోడ్లపై నిలిచిన నీరును బయటకు పంపుతున్నారు. శనివారం కావడంతో కొంతలో కొంత నయం. సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోవడంతో ఒకింత ఊరట కల్గించే అంశంగా చెబుతున్నారు.
Next Story