Fri Nov 22 2024 08:36:54 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ పబ్ లో పాములు
వన్యప్రాణి సంరక్షకులు పబ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ కు వెళ్లిన కొందరు షాక్ అయ్యారు. అయితే అవేవీ విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. వన్య ప్రాణులను పబ్బుల్లోకి తీసుకుని వచ్చింది ఎవరు అనే కోణంలో ఆరాతీయడం మొదలుపెట్టారు.
జూబ్లీ హిల్స్‌లో ఉన్న Xora నైట్ క్లబ్ లోనివి ఈ విజువల్స్. ఇటీవల 'వైల్డ్ జంగిల్ పార్టీ' థీమ్‌లో భాగంగా ఈ ప్రాణాలను తీసుకుని వచ్చారు. నిజమైన వన్యప్రాణులను తీసుకుని వచ్చి.. వచ్చిన వాళ్లను థ్రిల్ చేయాలని పబ్ యాజమాన్యం భావించింది. ఈవెంట్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన తర్వాత ఈ క్లబ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వన్యప్రాణి సంరక్షకులు పబ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ అయింది. ఫుల్ సౌండ్ తో సాంగ్స్ పెట్టుకుని ఉండగా.. మనుషుల మీద వన్య ప్రాణులు తిరగడం చూడవచ్చు. దీనిపై ఇక ట్విట్టర్ లో కూడా చర్చ జరిగింది. అటువంటి వాతావరణంలో వన్య ప్రాణులను తీసుకుని రావచ్చా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు. మన చట్టాలు అందుకు ఒప్పుకుంటాయా అని కూడా ప్రశ్నించారు. క్లబ్ ప్రాంగణంలో వివిధ జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. స్పష్టంగా అవి వాటి సహజ ఆవాసాలకు దూరంగా ఉన్నాయి. ట్విట్టర్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుండి తక్షణ ప్రతిస్పందన వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అరవింద్ కుమార్ పోలీసులను సంప్రదించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికరమైనదని తెలిపారు.
Next Story