Mon Dec 23 2024 02:00:25 GMT+0000 (Coordinated Universal Time)
వెళ్లి.. మళ్లీ రావయ్యా....!
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాది మంది ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు.
ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాది మంది ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. సందడిగా నృత్యాలు చేస్తూ గణనాధునికి వీడ్కోలు పలికారు. 63 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు పదకొండు రోజులు భక్తుల పూజలు అందుకున్నాడు. అనంతరం ఆయనను నిన్న రాత్రి నుంచి నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటలకే ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభమయింది.
ఆరు గంటల పాటు...
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ట్యాంక్‌బండ్ కు చేరుకుంది. గణేశ్ ను నిమజ్జనాన్ని వీక్షించేందుకు, చివరి సారిగా వీడ్కోలు పలికేందుకు వేల మంది భక్తులు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. క్రేన్ నెంబరు 4 వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకూ ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర దాదాపు ఆరు గంటల పాటు సాగింది. ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న గణేశుడికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరారు.
లక్ష విగ్రహాలు...
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది దాదాపు లక్ష విగ్రహాలకు పైగానే ఏర్పాటు చేశారు. రేపు ఉదయం వరకూ నిమజ్జనం కొనసాగుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ఒక్కొక్కరుగా వచ్చి తమకు కేటాయించిన క్రేన్ల వద్దనే తమ వినాయకుడిని నిమజ్జనం చేసుకుని వెళ్లాలని సూచించారు. పోలీసులకు కూడా సహకరించాలని గణేశ్ ఉత్సవ సమితి కోరింది. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తి కావడం, శోభాయాత్ర శాంతియుతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story