హెచ్సీయూ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ: “పర్యావరణాన్ని కాపాడుకుందాం!
400 ఎకరాల అడవి భూమి రక్షణ కోసం కేటీఆర్ పౌరుడిగా పోరాటం ప్రకటిస్తూ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల పచ్చని అడవి భూములను రక్షించాల్సిన అవసరం ఉందని, అందరినీ ఐక్యంగా పోరాటానికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. “నేను రాజకీయ నేతగా కాదు… ఓ పౌరుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా ఈ భూములను, వన్య ప్రాణులను కాపాడాలని నిశ్చయించుకున్నా” అంటూ ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రకృతి ప్రేమికులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ 400 ఎకరాల భూమి 734 జాతుల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 రకాల క్షీరదాలకు నివాసంగా ఉంది” అని లేఖలో వివరించారు.
అభివృద్ధి పేరుతో పచ్చని అడవులను నాశనం చేయడాన్ని ఖండించారు. ఈ పోరాటం ఇంకా ముగియలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం స్వలాభం కోసమే పర్యావరణాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. అడవిని కాపాడేందుకు శాంతియుతంగా ఉద్యమిస్తున్న సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల ధైర్యాన్ని అభినందించారు. “వారు విలాసాలు కావాలని అడగరు… అడవి రక్షణ కోసమే నిలబడుతున్నారు” అన్నారు.
అయితే ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు విమర్శించారు. విద్యార్థులను బెదిరించడం, వారి ఉద్దేశాలను వక్రీకరించడం, యూనివర్సిటీని తరలిస్తామని బెదిరించడం ద్వారా ఉద్యమాన్ని నెచ్చెల్లగా అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు.
“ఇది కేవలం యూనివర్సిటీపై దాడి కాదు… ప్రజాస్వామ్యంపై, పర్యావరణంపై జరగుతున్న దాడి” అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. ఈ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణాన్ని కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.