Fri Nov 15 2024 08:56:53 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు అలర్ట్.. హైదరాబాద్ లో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
జాన్ కొన్ని నెలల క్రితం ఓ విందు పార్టీకి హాజరై మద్యం సేవించాడు. కొద్దిసేపటికి అతని ముఖంపై వేడిగా అనిపించడంతో అద్దంలో..
లిక్కర్ ఎలర్జీ. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా ? కంగారు పడకండి. ఇది ఒకరి నుండి మరొకరి వ్యాపించే అంటువ్యాధి కాదు. మందుబాబులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొలి లిక్కర్ ఎలర్జీ కేసును హైదరాబాద్ వైద్యులు గుర్తించారు. వేసవి తాపాన్ని భరించలేక కేసులకొద్దీ బీర్లు, ఇతర ఆల్కహాల్ ను అధికంగా సేవించే వారు మాత్రం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఆగ్రాకు చెందిన జాన్ (36) అనే వ్యక్తి నగరంలోని అశ్విని అలర్జీ సెంటర్ ఆస్పత్రికి రావడంతో ఈ వ్యాధి బయటపడింది. ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు. ఇలాంటి లిక్కర్ ఎలర్జీ కేసులు ప్రపంచంలో మహా అయితే ఒక 100 ఉండొచ్చన్నారు. చాలా అరుదైన వ్యాధిగా పేర్కొన్నారు. అసలేం ఏమయిందంటే..
జాన్ కొన్ని నెలల క్రితం ఓ విందు పార్టీకి హాజరై మద్యం సేవించాడు. కొద్దిసేపటికి అతని ముఖంపై వేడిగా అనిపించడంతో అద్దంలో చూసుకున్నాడు. ఎర్రబడినట్లు కనిపించడంతో పాటు చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసిన భావన కలిగింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కొంతకాలం తర్వాత మళ్లీ మద్యం సేవించినపుడు కూడా ఇదే అనుభవం ఎదురైంది. రిపీట్ అవుతుండటంతో సన్నిహితుల సూచన మేరకు అశ్విని అలెర్జీ సెంటర్ ను సంప్రదించాడు.
జాన్ నుంచి నమూనాలు సేకరించిన అక్కడి వైద్యులు.. అతడికి ఆల్కహాల్ అలెర్జీ ఉన్నట్లు గుర్తించారు. మద్యం సేవించేటపుడు మసాలా పల్లీలు, బఠానీలు, మటన్, చికెన్ తినడం వల్ల ఇది వస్తుందని, మద్యం సేవించిన తర్వాత ఇలాంటి అలెర్జీలు కనిపిస్తే.. మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story