Mon Dec 23 2024 04:32:32 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మందు బంద్
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఎన్ని రోజుల పాటు బంద్ చేయబోతున్నారో
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఎన్ని రోజుల పాటు బంద్ చేయబోతున్నారో తెలుసుకోవాలని ఉందా..? రెండు రోజుల పాటు. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను కూడా తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16 ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 17 సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు మూతపడనున్నాయి. బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాచకొండ సీపీ ఆదేశించారు. మల్కాజిగిరిలో ఆదివారం, సోమవారం జరగబోయే బోనాల ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని సీపీ చౌహన్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉన్నాయి.
Next Story