Sat Nov 23 2024 04:16:20 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ అంటే హైదరాబాదే మరి.. దానికేదీ సాటిరాదు అంతే
హైదరాబాద్ లో జీవనం అంటే అదో క్రేజ్.. పేదల నుంచి ధనవంతుల వరకూ వారికి తగిన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ లో జీవనం అంటే అదో క్రేజ్.. పేదల నుంచి ధనవంతుల వరకూ వారికి తగిన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఏ నగరానికి లేని ప్రత్యేకత వాతావరణం. చల్లటి వాతావరణం రారమ్మంటూ నగరం పిలుస్తుంది. చిరు వ్యాపారుల దగ్గర నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకూ... చిరుద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగి వరకూ ఇక్కడ నివాసం ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఖరీదైన నగరం అని చెప్పడానికి వీలులేదు. అందరి నగరంగా హైదరాబాద్కు ఎప్పటి నుంచో పేరుంది.
ఎక్కడి నుంచో వచ్చి...
అందుకే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. నోరూరించే ఆహారంతో పాటు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక రవాణా సౌకర్యం కూడా ఇటీవల మెరుగుపడింది. మెట్రో సౌకర్యంతో మరింత నగరానికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ప్రతి రోజూ నగరంలో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. నిజాం నవాబుల పాలనలోని కట్టడాల నుంచి నేటి ఆధునిక భవనాలు కూడా ఇక్కడ కొలువు దీరాయి.
రవాణా సౌకర్యాలు...
అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రైలు మార్గం కూడా నగరంలో సెటిల్ అవ్వడానికి కలసి వచ్చే అంశం. హైదరాబాద్ కు వస్తే పొట్ట నింపుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం దొరకడం ఖాయమని భావించి అందరూ ఇటువైపే వస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరిని ఆదరించే ఈ నగారనికి ఎన్నో ప్రాముఖ్యతలున్నాయి. అన్ని రకాలుగా సౌకర్యాలు లభించే హైదరాబాద్ లో ఉండటమంటే ప్రెస్టేజియస్ గా భావించే వారు చాలా మంది ఉన్నారు. ఐటీ కంపెనీల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే ఉండటంతో అన్ని రకాల వినోదం కూడా ఇక్కడ లభ్యమవుతుంది.
తొలి స్థానం...
తాజాగా హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. మెరుగైన జీవన ప్రమాణాలున్న జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచి హైదరాబాద్ తన ప్రాముఖ్యతను చాటుకుంది. మెర్పర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాకింగ్ 2023లో హైదరాబాద్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానంలో పూనే, బెంగళూరు, చెన్నైలు ఉన్నాయి. ఈ ర్యాకింగ్ లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పేరు తెచ్చుకోవడం హైదరాబాద్ కు మరో ఘనత దక్కినట్లే.
Next Story