Tue Dec 03 2024 19:39:17 GMT+0000 (Coordinated Universal Time)
నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి ఒకరు మరణించారు. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మరణించాడు. షైబాజ్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. నెహ్రూ జూ పార్క్ 60 ఏళ్ల ఉత్సవం సందర్భంగా ఇతర ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లగా, ఏనుగుల ఎన్ క్లోజర్ లో షైబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు. ఒక్కసారిగా ముందుకొచ్చిన ఏనుగు అతడిని నేలకేసి విసిరికొట్టింది. ఏనుగు దాడిలో షైబాజ్ కు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
"ఈరోజు మధ్యాహ్నం 03.00 గంటల సమయంలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో 23 సంవత్సరాల షైబాజ్ పైకి ఓ ఏనుగు దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని అత్యవసర చికిత్స కోసం అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 04.00 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు." అంటూ జూ క్యూరేటర్ ప్రకటన విడుదల చేశారు.
Next Story