Thu Nov 07 2024 02:53:58 GMT+0000 (Coordinated Universal Time)
MGIT : ఎండలు మండిపోతున్నాయ్. సెలవులు ఇవ్వండి బాబోయ్
ఎంజీఐటీ విద్యార్థులు తమకు వేసవి సెలవులు ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఉక్కపోతతో యువకుల నుంచి వృద్ధుల వరకూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎంజీఐటీ విద్యార్థులు తమకు వేసవి సెలవులు ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. గండిపేటలోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు కళాశాలకు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనుకు దిగారు. ఈ వేసవి సీజన్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ శివార్లలోని గండిపేటలోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టారు.
లంచ్ బ్రేక్ లో...
విద్యార్థులు ఈరోజు తమ భోజన విరామంలో మధ్యాహ్నం 12:30 నుండి 1:30 గంటల వరకు అడ్మిన్ బ్లాక్‌ను చుట్టుముట్టారు. తమకు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే వేసవి సెలవులను ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎంజీఐటీ విద్యార్థులు ఉదయం 9:15 గంటలకు వారి క్యాంపస్‌కు వెళ్లి దాదాపు ఏడు గంటల పాటు 4:15 వరకు ఉంటారు. గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 14 రోజుల పాటు సెలవులు ప్రకటించగా, ఈ సంవత్సరం వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. దీంతో విద్యార్థులు ఆందో్ళనకు దిగారు.
ఫ్యాన్లు లేకపోవడంతో...
వేడి ఎక్కువగా ఉండటం, తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో కొన్ని గంటల పాటు తాము క్లాస్ రూముల్లో కూర్చోవడం కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. వేసవి సెలవులు ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకూ ఇస్తే తాము ఇళ్లకు పోతామని చెబుతున్నారు. జులై వరకూ తమకు ఎలాంటి పరీక్షలు లేవని, అయినా మేనేజ్ మెంట్ మాత్రం సెలవులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కళాశాలకు హాజరు కావాల్సిందేనని వత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అయితే యాజమాన్యం మాత్రం తమకు జేఎన్టీయూ అకడమిక్ షెడ్యూల్ ను నిర్ణయించినట్లే తరగతులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
Next Story