Sun Dec 22 2024 11:52:34 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో కొత్త వైరస్.. బాధపడుతున్న నగరవాసులు
హైదరాబాద్ లో కొత్తరకం వైరస్ బయటపడినట్లుంది. నగరవాసులు ఎక్కువుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు
హైదరాబాద్ లో కొత్తరకం వైరస్ బయటపడినట్లుంది. నగరవాసులు ఎక్కువుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. అయితే పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా గొంతు నొప్పి, ఒళ్లునొప్పులు, జలుబుతో అనేక మంది బాధపడుతున్నారు. ఇది వైరస్ ప్రభావమేనని వైద్యులు చెబుతున్నారు. గత వారం నుంచి ఇలాంటి రకమైన లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుండంతో ఆందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఇదే రకమైన లక్షణాలతో బాధపడుతున్నారు.
గొంతు గరగర...
గొంతు గరగరగా అనిపించడంతో ఈ వ్యాధి ప్రారంభమై తర్వాత ఒళ్లునొప్పులు, జ్వరం వస్తున్నాయని తెలిపారు. అనేక మంది నీరసంగా ఉండటంతో మరో కొత్త వైరస్ వచ్చిందని జనం భయపడి పోతున్నారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి సాధారణంగా సీజన్ మారినప్పుడు కనిపించేవేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయి ఒక్కసారిగా తగ్గడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చని కూడా చెబుతున్నారు.
ఆసుపత్రులకు క్యూ...
మరోవైపు ఇది కొత్తరకం వైరస్ ఏమోనని జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నీరసంగా ఉండటంతో ప్రజలు ఈ కొత్తరకమైన వ్యాధి ఏంటన్న దానిపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ ఎక్కువ మంది ఇదే రకమైన లక్షణాలతో వస్తున్నారని, అయితే దీనికి భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నా ప్రజలు మాత్రం కొంత ఆందోళనలో ఉన్నారు. దీనికి విశ్రాంతి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా ఇలాంటి రకమైన లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇది సహజంగా వచ్చేవని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
Next Story