Sat Dec 28 2024 18:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : న్యూ ఇయర్ వేడుకలకు అలెర్ట్ అయిన పోలీసులు.. హైదరాబాద్ సిటీపై నజర్
హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోలీసులు ఇందుకోసం అనేక ఆంక్షలు విధించారు
మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రికి సంబంధించి ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనేక పబ్బులు, ఈవెంట్ మేనేజ్ మెంట్లు న్యూ ఇయర్ కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్నారు. గత పదిహేను రోజుల నుంచి పోలీసుల నుంచి దాదాపు వందల సంఖ్యలో పబ్ లు, ఈవెంట్ మేనేజర్లు అనుమతులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం షరతులు ఈసారి విధించారు. భారీ స్థాయిలో జనం గుమిగూడే ప్రాంతంలో సామర్థ్యానికి మించి అనుమతిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవుట్ డోర్ లో జరిగే ఈవెంట్స్ కు ఐదు వేలకు మించకుండా ఉండాలని చెబుతున్నారు.
ఈవెంట్ జరిగే చోట...
దీంతో పాటు ఎక్కడ ఈవెంట్ చేసినా ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అలా సీసీ కెమెరాలు చేయకుంటే ఈవెంట్ ను మధ్యలో ఆపేయగలమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా డేజీ సౌండ్ కూడా పరిమితిని విధించారు. 45 డెసిబుల్ కు మించి పెడితే ఈవెంట్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇక ఈవెంట్స్ లో మద్యం సరఫరాకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. మద్యం తాగిన వారిని వారి ఇళ్లకు చేర్చేలా ఈవెంట్ నిర్వాహకులు, పబ్ యజమానులు బాధ్యత తీసుకోవాలని, అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డ్రగ్స్ నియంత్రణకు...
అదే సమయంలో హైదరాబాద్ లో డ్రగ్స్ నియంత్రణకు కూడా పోలీసులు పెద్దయెత్తున నిఘా పెంచారు. డ్రగ్స్ కల్చర్ ఇటీవల పెరగడంతో దానిపై ఎక్కడక్కడ పోలీసులు మాటు వేసి పట్టుకునేందుకు సిద్ధమయ్యారు.డ్రగ్స్ ఏమాత్రం ఇక్కడ పంపిణీ చేసినట్లు తెలిసినా వెంటనే అదుపులోకి తీసుకుంటామని, పబ్ ను సీజ్ చస్తామని హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాలైన గోవా, బెంగళూరు, ముంబయి నుంచి డ్రగ్స్ ను కొత్త ఏడాది వేడుకలకోసం కొందరు తెస్తున్నారన్న సమచారంతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటుచేయడమే కాకుండా వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ రహిత న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story