Fri Nov 22 2024 15:15:48 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే ఒక్క రూపాయికే అందుతున్న వైద్యం.. మన దగ్గరే
ఒక గ్యాస్ ఏజెన్సీ యజమాని హైదరాబాద్ లోని రామ్ నగర్లో గంగయ్య గారి ఛారిటీ హాస్పిటల్
ఆసుపత్రికి వెళ్లాలంటేనే జనం జంకుతూ ఉంటారు. రోగం తగ్గించుకోవాలని మనసులో ఉన్నా.. ఆసుపత్రికి వెళ్తే ఖర్చు ఎక్కువవుతుందని భావించి చాలా వరకూ సొంత వైద్యాన్నే నమ్ముకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో బిల్లులు చూసి మిడిల్ క్లాస్ జనం ఎంతగానో భయపడుతూ ఉంటారు. తక్కువ డబ్బు తీసుకుని వైద్యం అందించే వ్యక్తులు కూడా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఆసుపత్రి గురించే మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం.
ఒక గ్యాస్ ఏజెన్సీ యజమాని హైదరాబాద్ లోని రామ్ నగర్లో గంగయ్య గారి ఛారిటీ హాస్పిటల్ (GGCH)ని ప్రారంభించారు. ఇక్కడ రోగులు డాక్టర్ కన్సల్టేషన్ కోసం కేవలం రూ. 1 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ 1,500 నుండి 2,000 మంది రోగులు ఇక్కడ ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరంతా `1' రూపాయి కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి ఛైర్మన్ గంగాధర్ గుప్తా మాట్లాడుతూ ఫిబ్రవరిలో మానవాళికి సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నానని, తన డబ్బుతో ఆసుపత్రిని ప్రారంభించానని మీడియాకి చెప్పారు.
ఆసుపత్రుల్లో సేవలు అందుకుంటున్న ఎంతో మంది రూపాయికే వైద్యం ఇస్తుండడం చూసి ఆనందించడమే కాకుండా.. ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తన రెండేళ్ల మనవడికి ఆసుపత్రిలో చికిత్స చేశారని లక్ష్మి చెప్పుకొచ్చింది. ఈ ఏర్పాటు ఆసుపత్రి గురించి గూగుల్ ద్వారా తెలుసుకున్నామని చెబుతున్నారు కొందరు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వందల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం కనిపించలేదని.. ఇక్కడి వైద్యులు సూచించిన మొదటి డోస్ కే మంచి ఫలితాలు వచ్చాయని అని ఆమె చెప్పింది. ఇక ఆసుపత్రిలో రాసిచ్చే అన్ని మందులు ఫార్మసీలో 50 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఆసుపత్రిలోని లేబొరేటరీలలో పరీక్షలకు సంబంధించి కూడా అతి తక్కువ ఖర్చు అవుతుంది.
ఆసుపత్రిలోని నాలుగు అంతస్తులలో ENT, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, గైనకాలజీ, ఫిజియోథెరపీ విభాగాలు ఉన్నాయి. 18 మంది వైద్యులు, 30 మంది నర్సులు, 100 మందికి పైగా సిబ్బందితో కూడిన బృందం షిఫ్టులలో పని చేస్తున్నారు. ఒకరు మరొకరు చెబుతూ.. ఈ ఆసుపత్రికి వచ్చేస్తున్నారు. మిడిల్ క్లాస్, బీద ప్రజలు, తక్కువ జీతం పొందే కార్మికులు తరచుగా ఆసుపత్రిని సందర్శిస్తూ ఉంటారు. ఇక గంగాధర్ రోగులు, వారి బంధువులు, ఇతర సందర్శకులందరికీ రెండు పూటల భోజనం అందించాలని నిర్ణయించుకున్నారు. "ఆహారం-ఆరోగ్యం రెండు చాలా ముఖ్యమైన విషయాలు. రోగి ఆసుపత్రిలో ప్రవేశించే ముందు, వారి బీపీ, షుగర్ స్థాయిలు సాధారణంగా ఉండాలి. అప్పుడే పేషెంట్స్ కి చికిత్స అందించవచ్చు'' అని గంగాధర్ చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మందికి.. మరిన్ని సేవలను అందించాలని భావిస్తున్నామని గంగాధర్ వెల్లడించారు.
Next Story