Mon Dec 23 2024 16:01:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి నుంచి నుమాయిష్... ఇక కుమ్మేయండి
జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ మొదలవుతుంది
జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ మొదలవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయి. ఇందుకోసం రాష్ట్రాల వారీగా స్టాల్స్ ఎగ్జిబిషన్ సొసైటీ కేటాయించింది. ఇప్పటికే స్టాళ్ల నిర్వాహకులు వచ్చి తమ అంగళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన మొదలయిన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి రెండో వారం వరకూ కొనసాగుతుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పెద్దగా నడవని నుమాయిష్ పై ఈసారి వ్యాపారులు ఆశలు పెంచుకున్నారు.
ఏటా 25 లక్షల మంది...
దాదాపు 25 లక్షల మంది ఈ ఎగ్జిబిషన్ ను ఏటా సందర్శిస్తారు. కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. ఇటు వినోదం, అటు వ్యాపారం జోరుగా సాగనున్న ఎగ్జిబిషన్ లో అన్ని రకాల ఉత్పత్తులు లభిస్తాయి. 46 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,400 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అలాగే పెయిడ్ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ప్రయివేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తారు.
ఈసారి ధర పెంచుతూ...
అయితే ఈ ఏడాది ఎగ్జిబిషన్ ప్రవేశ టిక్కెట్ ధరను పెంచాలని నిర్ణయించారు. గతంలో ఒక్క వ్యక్తికి ముప్ఫయి రూపాయలు వసూలు చేసేవారు. కానీ ఈ ఏడాది దానిని నలభై రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది. ఎగ్జిబిషన్ లో వస్తువలతో పాటు నోరూరించే ఫుడ్ లభిస్తుండటంతో హైదరాబాదీలు నుమాయిష్ ను సందర్శించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
Next Story