Mon Dec 23 2024 07:28:28 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : బాధ్యతలేని హైదరాబాదీలు.. ఈసారి కూడా అంతేగా
హైదరాబాద్ వాసులు ఈసారి కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు.
హైదరాబాద్ వాసులు ఈసారి కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. ఎప్పటిలాగానే అతి తక్కువ పోలింగ్ శాతం హైదరాబాద్ లోనే నమోదు కావడం విశేషం. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద కాస్త హడావిడిగా కనిపించినప్పటికీ తర్వాత పోలింగ్ కేంద్రాలన్నీ బోసి పోయి కనిపించాయి. కేవలం అలా వెళ్లి ఇలా ఓటు వేసి వచ్చే పరిస్థితి నెలకొంది. కొత్త ఓటర్లు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. గత ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలలోనూ అదే సీన్ రిపీట్ కావడంతో ఎన్నికల కమిషన్ ఎంత చేసినా హైదరాబాద్ ఓటరు మారడన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకుందామన్న స్పృహ ఎవరికీ లేదు.
సెలవు కావడంతో...
పోలింగ్ రోజు సెలవు దినం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పాటు వరసగా మూడు రోజులు వరసగా సెలవు దినాలు రావడంతో అస్సలు హైదరాబాద్ లేకుండా వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సెలవు వస్తే చాలు.. ఎటో అటు వెళ్లిపోవాలని టూర్ ప్లాన్ చేసుకోవాల్సిందే కానీ.. బాధ్యతతో ఓటు వేయాలన్న ఆలోచన హైదరాబాద్ లో కొరవడిందని అధికారులు సయితం తలలు పట్టుకుంటున్నారు. పోలింగ్ రోజున అందరూ ఇంట్లో ఉండటమో.. లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపడటమో తప్పించి ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు.
అత్యల్పంగా...
గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత తక్కువ శాతం పోలింగ్ నమోదయింది. లోక్సభ ఎన్నికల్లో అత్యల్పంగా బహదూర్ పుర నియోజకవర్గంలో 34. 19 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత నిన్న ఎక్కువగా లేకపోయినా ఓటు వేయడానికి హైదరాబాదీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అనేక నియోజకవర్గాలలో 40 శాతానికి దాటకపోవడంతో ఎన్నికల కమిషన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలింగ్ శాతం పెరగడానికి చేసిన ప్రయత్నాలు ఈసారి కూడా ఫలించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాలకు అనుమతించకపోవడం వల్లనే ఎక్కువ మంది యువకులు పోలింగ్ కు రావడం లేదని ఒక అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. అదే కారణమయితే అంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
Next Story