Sat Jan 11 2025 06:28:41 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఇదిగిదిగో చెరువు.. ఈ నిర్మాణాలను కూల్చివేస్తే తప్పా? హైడ్రా ఎందుకు వచ్చిందంటే?
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను నగర ప్రజలు స్వాగతిస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చి వేయాల్సిందే నంటున్నారు.
చెరువులను ఆక్రమిస్తే ఏమవుతుంది. నీటి సమస్య తలెత్తుతుంది. భూగర్భ జలాలు అడుగింటి పోతాయి. భారీ వర్షం పడినప్పుడు చెరువులను మూసేసి అక్రమ నిర్మాణాలను నిర్మించిన చోట నీట మునుగుతాయి. అనేక కాలనీలు హైదరాబాద్ లో భారీ వర్షం పడినప్పుడు మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో ఎన్నో భవనాలు, బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు నిర్మించారు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బర్త్డే పార్టీకి పది లక్షలు...
పది ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ తుమ్మిడిహట్టి చెరువును దాదాపు చాలా వరకూ ఆక్రమించి నిర్మాణాలు జరిగాయి. ఇది మాదాపూర్ లో ఉండటం, అతి ఖరీదైన ప్రాంతం కావడంతో ఇక్కడ అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ను 2015లో నిర్మించారు. ఇందులో కేవలం డబ్బున్న వాళ్లే సమావేశాలు జరుపుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. బర్త్డే పార్టీకి ఒకరోజుకు ఎన్ కన్వెన్షన్ లో చేయాలంటే పది లక్షల రూపాయలు చెల్లించాలి. అంటే ఎంత ఖరీదైందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఖరీదైన బడా బాబులకే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. సామాన్యులు లోపలికి వెళ్లి తొంగి కూడా చూడలేని పరిస్థితి. ఇలాంటి ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేయడం ఎలా తప్పవతుందన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతుంది.
ఐదు ఎకరాలను ఆక్రమించి...
ఎన్ కన్వెన్షన్ ను సినీనటుడు నాగార్జున నిర్మించారు. ఆయనకు సినిమాలు నిర్మించడం కన్నా వ్యాపారాలు చేయడం ఎంతో ఇష్టం. అందుకే ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారంటారు. ఎన్ కన్వెన్షన్ ను తుమ్మిడి హట్టి చెరువు ప్రాంతంలో ఉన్న పది ఎకరాల్లో దాదాపు ఐదు ఎకరాలను ఆక్రమించి నిర్మించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎకరం పన్నెండు గుంటలను ఆక్రమించగా, బఫర్ జోన్ పరిధిలో రెండు ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయింది. కేవలం ఎన్ కన్వెన్షన్ ను మాత్రమే కాదు. ఈరోజు తుమ్మిడి హట్టి చెరువు పక్కన ఉన్న మరికొన్ని నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాజకీయ పార్టీల నుంచి కూల్చివేతలపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ నగర ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో...
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నేతలు బిల్డర్లుగా అవతారమెత్తడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరిగాయి. పదేళ్ల పాటు వీటిని పట్టించుకునే వారు లేరు. రాజకీయ నేతలు చెరువును ఆక్రమించుకున్న ప్రాంతంలో ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి ఫామ్ హౌస్ లు నిర్మించుకుంటే, కొందరు రాజకీయనేతల బినామీలుగా ఉన్న బిల్డర్లు భవనాలను, అపార్ట్మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మించారు. గత ప్రభుత్వం పూర్తిగా చూసీ చూడనట్లు వదిలేయడంతో పాటు వారి నుంచి భారీగా రాజీకీయ విరాళాలు సేకరించినట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో నిజానిజాలు లేకపోలేదు.
Next Story